వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర్‌ప్రదేశ్‌లో (UP elections 2022) అయోధ్యే కీలకమైన ప్రచారాస్త్రం కానుంది. బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు (ayodhya verdict) వెలువడిన తర్వాత యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. ప్రచారంలో అయోధ్య రామాలయమే ముఖ్యమైన అంశంగా నిలుస్తుందనే సంకేతాలు ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల వ్యవధే మిగిలి ఉంది. భాజపా, ఎస్పీ, బీఎస్సీ సహా పలు పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని (UP election campaign) ఈ అంశంతోనే ప్రారంభించనున్నాయి. ప్రస్తుతం అయోధ్య అసెంబ్లీ స్థానానికి భాజపా అభ్యర్థి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు ఈ నగరాన్ని సందర్శిస్తున్నారు.
ఎన్నికల కోణంలో కాదు...
అయోధ్యలో రామాలయం తమకు ఎప్పటికీ ముఖ్యమేనని, దానిని ఎన్నికల కోణంలో చూడడం లేదని భాజపా యూపీ అధికార ప్రతినిధి మనీష్ శుక్లా చెబుతున్నారు. దళితులు, బ్రాహ్మణుల మద్దతు పొంది 2007 మాదిరి విజయాన్ని మరోసారి సాధించాలని బహుజన్‌సమాజ్ పార్టీ ఆశపడుతోంది.
ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య అంశంతో ప్రారంభించడానికి కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉండేలా ఉంది. దీని బదులు యూపీలో అన్ని గ్రామాలు, పట్టణాల మీదుగా 12,000 కి.మీ. మేర ప్రతిజ్ఞ యాత్రను ఆ పార్టీ చేపట్టనుంది.
ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించనున్న కాంగ్రెస్
యూపీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల్ని వీలైనంత ముందుగానే ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) తెలిపారు. తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటనకు ఆదివారం ఆమె శ్రీకారం చుట్టారు. తొలుత హనుమాన్ మందిరంలో పూజలు జరిపారు. అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించడం గురించి కార్యకర్తల సమావేశంలో ప్రియాంక వెల్లడించారని పార్టీ నాయకుడొకరు తెలిపారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్‌లో మేం కోరుకున్న ప్రక్షాళన మొదలైంది'