లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే రాష్ట్రాలు పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ప్రజలంతా కరోనా నియమాలు పాటించాలని, తద్వారా దేశాన్ని లాక్‌డౌన్ నుంచి కాపాడాలని కోరారు. దేశంలో కరోనా పరిస్థితులపై జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ధైర్యంగా ఉంటేనే కఠిన పరిస్థితులను ఎదుర్కోగలుగుతామని చెప్పారు. వైద్యులు, వైద్య సిబ్బంది కృషికి ధన్యవాదాలు తెలిపారు.
"కొన్నాళ్లుగా కరోనాపై కఠినమైన పోరాటం చేస్తున్నాం. రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాలు విసురుతూ తుపానులా విరుచుకుపడుతోంది. ధైర్యంగా ఉంటేనే కఠిన పరిస్థితులను ఎదుర్కోగలుగుతాం. మనం తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్‌లో పరిస్థితిని చక్కదిద్దుతాయి. లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే పరిగణించాలి. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించి.. దేశాన్ని లాక్‌డౌన్ నుంచి కాపాడాలి.
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఔషధాల కొరత లేదు..
అవసరమైన అందరికీ ఆక్సిజన్ అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని తెలిపారు. ఫార్మా కంపెనీలు ఔషధాల ఉత్పత్తిని పెంచాయని చెప్పారు. ప్రపంచంలోనే ప్రఖ‌్యాతిగాంచిన ఔషధ సంస్థలు భారత్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదని స్పష్టం చేశారు.
యువత ముందుండాలి..
ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశంగా భారత్ నిలిచిందని మోదీ తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేస్తే నగరాల్లో సత్ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. 45 ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
"ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ఫ్రంట్‌లైన్ వారియర్స్, వయోవృద్ధులకు టీకాలు వేశాం. మే 1 తర్వాత 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం. నగరాల్లో పనిచేస్తున్న జనాభాలో 18 ఏళ్లు దాటినవారే అధికంగా ఉన్నారు. వారికి టీకాలు వేస్తే నగరాల్లో సత్ఫలితాలు వస్తాయి. కరోనా మార్గదర్శకాలు పాటించడంలో యువత ముందుండాలి. చిన్నారులను అత్యవసరం అయితేనే బయటకు పంపించాలి."
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
చాలా తక్కువ సమయంలో ప్రజల సహకారంతోనే కరోనాపై విజయం సాధించగలమని పేర్కొన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కరోనాపై పోరులో భాగస్వామ్యం అయ్యాయని చెప్పారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ వందనాలు తెలిపారు. రాముడు చెప్పినట్లుగా కరోనా నియమాలు పాటించాలని మోదీ తెలిపారు. రంజాన్ మనకు ధైర్యం, క్రమశిక్షణను బోధిస్తోందన్నమోదీ.. ఆ స్ఫూర్తిని కరోనా కట్టడిలోనూ పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: 'రాముడి ఆదర్శాలను మనమూ పాటిద్దాం'