మాస్కు ధరించలేదని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తి పట్ల అమానుషంగా వ్యవహరించారు. అతడి చేతికి, కాలికి మేకులు దించారు. ఈ ఘటన బరేలీలోని బరాదరీ ప్రాంతంలో జరిగింది. బాధితుడి తల్లి పోలీసు అధికారులను ఆశ్రయించగా.. ఇది వెలుగులోకి వచ్చింది.
మే 24 రాత్రి 10 గంటల ప్రాంతంలో తనతోపాటు తన కుమారుడు ఇంటి ముందు కూర్చున్నామని, అంతలో ముగ్గురు స్థానిక పోలీసులు అక్కడకు వచ్చినట్లు ఆమె అధికారులకు తెలిపారు. మాస్కులు ఎందుకు ధరించలేదని ప్రశ్నించి, తన కుమారుడితో దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు. అంతలో వాగ్వాదం జరగడంతో తన కుమారుడిని వారు తీసుకెళ్లిపోయినట్లు వివరించారు. స్థానిక పోలీసు పోస్టు వద్దకు వెళ్లి వారిని అడిగితే.. తన కుమారుడిని అరెస్టు చేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. మరుసటి రోజు తెల్లవారుజామున తీవ్ర గాయాలతో.. చేతికి, కాలికి మేకులతో దయనీయ స్థితిలో కనిపించినట్లు తెలిపారు.
బుధవారం వెళ్లి ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి న్యాయం చేయాలని వారిని కోరారు. కాగా ఈ వ్యవహారంలో సీనియర్ ఎస్పీ రోహిత్ సజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ.. సదరు వ్యక్తిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులున్నాయని తెలిపారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే వారు ఈవిధమైన ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు. వారి ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపారు.
ఇదీ చదవండి- 13 మందితో 'ఆమె' పెళ్లి- మరొకరిని చేసుకునేలోపే...