UP Varanasi Election 2022: సనాతన ధర్మానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే వారణాసి నగరంలో రాజకీయ కోలాహలం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు గానూ ఆరింటిలో ప్రస్తుతం భాజపా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో రెండు స్థానాలను భాజపా మిత్రపక్షాలే 2017 శాసనసభ ఎన్నికల్లో గెలుచుకున్నాయి. 2014లో వారణాసి ఎంపీగా మోదీ మొదటిసారి గెలుపొందిన వెంటనే ఈ చారిత్రక నగరాభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రధానిగా ఆయన చేపట్టిన పనుల్లో 'కాశీ విశ్వనాథ్ నడవా (కారిడార్)' ప్రాజెక్టును మొట్టమొదట చెప్పుకోవాలి. గతంలో గంగానదిలో స్నానమాచరించిన భక్తులు దైవదర్శనానికి వెళ్లేందుకు సరైన మార్గం లేక చాలా అవస్థలు పడేవారు. కారిడార్ ప్రాజెక్టుతో ఈ సమస్య తీరింది. మరో భారీ పథకమైన దిల్లీ-వారణాసి బుల్లెట్ రైలు మార్గ నిర్మాణం చేపట్టే యోచనలో మోదీ ప్రభుత్వం ఉంది.
తగ్గని కమలం ప్రభ
UP election 2022: వారణాసిలో భాజపా ప్రభ కొనసాగుతోంది. 1957 నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ భాజపా ఏడుసార్లు, కాంగ్రెస్ ఆరుసార్లు గెలుపొందాయి. లోక్‌సభ నియోజకవర్గంలో భాజపాకు పట్టు ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు నేతలు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకున్న ఎస్‌బీఎస్‌పీ అధినేత ఓంప్రకాష్ రాజ్‌భర్ మంత్రిగా కొంతకాలం కొనసాగాక విభేదాలు పొడసూపి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఎన్నికలోనూ వివిధ సామాజిక వర్గాలు ప్రాబల్యం చూపుతున్నాయి.
ముస్లిం ఓటర్ల ప్రాబల్యం.. భాజపా విజయం!
UP Election 2022: నగర ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధిక శాతం ఉన్నారు. మొట్టమొదటి ఎన్నికల నుంచి చూస్తే ఈ స్థానాన్ని తొలుత భారతీయ జనసంఘ్, ఆ తరువాత భాజపా ఎక్కువసార్లు కైవసం చేసుకున్నాయి. 14% వరకు ముస్లిం ఓటర్లు ఉన్న నగర దక్షిణ నియోజకవర్గంలో కుల సమీకరణలు ప్రత్యేక పాత్ర పోషిస్తుంటాయి. విశ్వనాథ ఆలయం, ఇతర ఆలయాలు ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి. ఈ అసెంబ్లీ స్థానం నుంచి భాజపా తరఫున శ్యామ్‌దేవ్‌రాయ్ చౌధరి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారణాసి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఒకే కుటుంబానికి చెందినవారు 20 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక్కడ కాయస్థ ఓటర్లదే కీలకపాత్ర. యూపీ రాష్ట్ర మంత్రి అనిల్ రాజ్‌భర్ ప్రాతినిధ్యం వహిస్తున్న శివపుర్ నియోజకవర్గంలో ఎక్కువగా యాదవ్, రాజ్‌భర్, దళితులు, బ్రాహ్మణులు ఉన్నారు. రోహనియా నియోజకవర్గం.. పటేల్ వర్గీయుల ప్రాబల్య ప్రాంతం. అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. పటేల్ ఓటర్లు 10-11% ఉన్నారు.
ప్రభుత్వ తీరుపై మిశ్రమ స్పందన
వ్యవసాయ బిల్లుల కారణంగా పశ్చిమ యూపీలో రైతుల ఆందోళనలు వెల్లువెత్తాయి. భాజపా ప్రభుత్వ పనితీరును ప్రజలు బాహాటంగానే వ్యతిరేకించారు. వారి నిరసనల ఫలితం ఎన్నికల్లో తేలాల్సి ఉంది. ప్రభుత్వంపై పశ్చిమ యూపీలో ఉన్నంత తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఇక్కడ లేదు. నగరంలో భాజపా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నా.. సాధారణ ఓటర్లలో కొంత వ్యతిరేకత, మరికొంత సందిగ్ధత కనిపిస్తున్నాయి. వారణాసికి పది కిలోమీటర్ల దూరంలోని సారనాథ ప్రాంతంలో ఒక టైలరు 'ఈనాడు'తో మాట్లాడుతూ 'జోభీ ఆయేంగే.. వో కుచ్ నహీ కరేంగే' (ఎవరొచ్చినా ఏమీ చేయరు) అని అసంతృప్తి వ్యక్తంచేశారు. బీహెచ్‌యూ విశ్రాంత ఆచార్యుడొకరు మాట్లాడుతూ- భాజపా ప్రభుత్వం ఏదో చేస్తున్నట్లుగా భ్రమలు కల్పిస్తోందని, సాధారణ ప్రజానీకానికి వాటి ఫలితాలు అందడం లేదని అన్నారు. ఈసారి ఎన్నికల్లో భాజపాకు పెద్ద దెబ్బ తగులుతుందన్నారు.
ఇదీ చదవండి: Yogi Adityanath: 'విపక్షాల పోటీ రెండో స్థానం కోసమే'