UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన పలు భాజపా ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా పాలన సాగించారని విమర్శలు గుప్పించారు.
మధుర, ఆగ్రా, బులంద్‌షెహర్‌ప్రాంతాల్లో పర్యటనల సందర్భంగా మోదీ మాట్లాడుతూ "గతంలో అధికారంలో ఉన్న నేతలు ప్రజల విశ్వాసాన్ని పొందలేదు. వారి అవసరాలను తీర్చలేదు. రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా పెట్టుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారు. అర్థబలం, కండబలం, కులం, మతం ప్రాతిపదికన కొందరు ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజల ప్రేమను పొందలేరని యూపీ ప్రజలు నిరూపించారు. ఎవరైతే సేవకుడిగా మారి ప్రజాసేవ చేస్తారో వారికే ప్రజల ఆశీస్సులు ఉంటాయి" అని మోదీ చెప్పుకొచ్చారు. భాజపా ప్రభుత్వంలో దళితులు, వెనుకబడిన తరగతులు, పేదలు, మహిళలు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందారని మోదీ గుర్తుచేశారు. అందుకే యూపీ రాష్ట్రం మరోసారి యోగి ప్రభుత్వాన్నే కోరుకుంటోందని మోదీ తెలిపారు.
Modi Rally in UP: ఇటీవల తన కలలో శ్రీకృష్ణుడు కనిపించాడని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు కృష్ణుడు చెప్పాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వెల్లడించాడు. దీనిపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. రాష్ట్రంలో భాజపాకు లభిస్తున్న మద్దతు చూసి కొందరికి కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
సీఎం అభ్యర్థి యోగి..
Modi News: ఉత్తరప్రదేశ్‌లో భాజపా తరపున సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ అని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే.. కరోనా కారణంగా చేయలేకపోయిన పనులన్నీ పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. భాజపా అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో మోదీ స్పందించారు.
యోగి హయాంలో రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరిగిందని మోదీ చెప్పారు. కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే.. ఇంకా చాలా అభివృద్ధి జరిగి ఉండేదని ప్రధాని అన్నారు. కేంద్ర పథకాల కింద రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వగలిగేవాళ్లమని చెప్పారు.
ఇదీ చదవండి: యూపీలో వ్యూహం మార్చిన భాజపా.. వర్గ రాజకీయాలపై దృష్టి!