UP elections 2022: దిల్లీ పీఠానికి దగ్గరిదారిగా భావించే ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు వచ్చాయంటే దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాన్ని గుప్పిట పట్టుకుంటే కేంద్రంలో పెత్తనం చెలాయించడం కష్టమేమీ కాదు. రాజకీయ పార్టీలకు ఈ విషయం తెలిసిందే. అందుకే ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాయి. దేశ రాజకీయాల్లో ఉన్నత దశను అనుభవిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇందుకు అతీతమేం కాదు. అందుకే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అఖండ మెజార్టీతో 2017 ఎన్నికలు గెలిచి రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లు పాలించిన కమలం పార్టీ.. మరోసారి అధికారంలోకి వచ్చి.. సార్వత్రిక ఎన్నికలకు ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకోవాలని భావిస్తోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రంగంలోకి దిగి.. ఎన్నికల్లో భాజపాను ముందుండి నడిపిస్తున్నారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు.
UP Polls 2022 BJP
ఇక, క్షేత్రస్థాయిలోనూ కమలం పార్టీ వ్యూహాత్మకంగా దూసుకెళ్తోంది. పక్కా లెక్కలతో ముందుకెళ్తోంది. సామాజిక వర్గాలను, వారికి సమాజంలో ఉన్న ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకొని.. తమ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బ్రాహ్మణ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. సంప్రదాయంగా భాజపా ఓటు బ్యాంకుగా భావించే వీరిని మరింత ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టున్న బ్రాహ్మణ సంఘాలను ఎంపిక చేసి.. ఆయా ప్రతినిధులను కలిసేందుకు ప్రణాళికలు రచించింది భాజపా. 25 రోజుల్లో ఆయా సంఘాల ప్రతినిధులను కలిసి.. తమకు అండగా ఉండాలని కోరనుంది. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు డిసెంబర్ 26న నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి కేంద్ర మాజీ మంత్రి శివ ప్రతాప్ శుక్లా నేతృత్వం వహిస్తున్నారు. మహేశ్ శర్మ, అభిజత్ మిశ్ర, రామ్ భాయ్ మొరాకియాలు సభ్యులుగా ఉంటారు.
Brahmin votes in UP
BJP Brahmin program in UP
భాజపా అధిష్ఠానం మార్గనిర్దేశం ప్రకారం ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటికే పని ప్రారంభించింది. ఉత్తర్ప్రదేశ్ రాజధాని అయిన లఖ్నవూలో తొలి సమావేశం ఏర్పాటు చేసింది. జనవరి 4న కమిటీ మరోసారి భేటీ కానుంది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం భాజపా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్లో చేపట్టే పనులను సంఘాల ప్రతినిధులకు వివరించడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. 25 రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధిష్ఠానం వీరిని ఆదేశించినట్లు తెలుస్తోంది.
BJP meeting Brahmin community
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించిన ఎలక్షన్ కమిషన్.. త్వరలోనే ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇందులోని వివరాల ప్రకారం అన్ని ప్రాంతాల్లో ఆయా సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భాజపా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే 80 బ్రాహ్మణ సంఘాలను పార్టీ ప్రతినిధులు కలిసి.. భాజపా కార్యక్రమాలను వివరించారు. మరో ఆరు సంఘాలను కలవాల్సి ఉంది. జనవరి 6లోపు ఈ పని పూర్తి చేయాలని భావిస్తోంది.
'అసంతృప్తులు తక్కువే'
భాజపాకు బ్రాహ్మణ అభ్యర్థి లేని నియోజకవర్గాలపై జనవరి 6 తర్వాత దృష్టిసారించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భాజపా పాలన పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
"ప్రజలకు మేం సాధించిన విజయాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం చేసిన పని పట్ల మెజార్టీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. ఎక్కడో ఓ చోట అసంతృప్త ఓటర్లు ఉంటారు. బ్రాహ్మణ ఓటర్లందరినీ గుర్తించి వారి సమస్యలను పరిష్కరిస్తాం. చాలా మంది ఓటర్లు ఎన్నికల సమయంలో నిస్వార్ధంగా భాజపా తరఫున పని చేస్తున్నారు. వారందరినీ పార్టీ కార్యకర్తల్లానే భావిస్తాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ నచ్చాలని లేదు. అభిప్రాయభేదాలు ఉన్నా ఫర్లేదు, వివక్ష ఉండకూడదు."
-అభిజత్ మిశ్ర, భాజపా నేత
యోగి సర్కారు తీరుపై బ్రాహ్మణులు అసంతృప్తితో ఉన్నారని, భాజపాకు క్రమంగా దూరమవుతున్నారని, ఆ పార్టీని ఓడించేందుకు ఏకమయ్యారని విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని మిశ్ర ఖండించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి బ్రాహ్మణ వర్గాలను అయోమయానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదంతా ప్రతిపక్షాలు సృష్టించిన ప్రతికూల వాతావరణమేనని, వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ ఏడాది మే నెలలో యోగి ప్రభుత్వం గడువు ముగియనుంది. ఏప్రిల్కు ముందే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ చదవండి: