ఉత్తర్‌ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో(UP election 2022) విజయం సాధించేందుకు భాజపా అగ్రనేతలు వ్యూహం రూపొందించారు. రాష్ట్రాన్ని(UP BJP news) మూడు జోన్లుగా విభజించి బాధ్యతలను ముగ్గురు ప్రముఖులకు అప్పగించారు. రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఉన్న పశ్చిమ యూపీ ప్రాంతాన్ని వ్యూహచతురుడైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అప్పగించారు. ఆగ్రహంగా ఉన్న రైతులు, జాట్‌లు, గుజ్జర్లను పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన దోహదపడతారని అధిష్ఠానం భావించింది.
పశ్చిమ యూపీ, బ్రజ్ ప్రాంతాల్లోని జిల్లాల్లో 140కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 130 కంటే ఎక్కువ స్థానాల్లో జాట్‌లు, గుజ్జర్ల ప్రాబల్యం ఎక్కువ. ఏ పార్టీకైనా ఈ ప్రాంతం కీలకం. 2017 ఎన్నికల్లో(UP election news) ఇక్కడ సగానికి పైగా స్థానాలను గెలుచుకోవడం ద్వారా భాజపా అధికారంలోకి రాగలిగింది. అందుకే ఆ పార్టీ ఈ ప్రాంతంపై అత్యంత ఆసక్తి కనపరుస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో రైతుల్లో కొంత అసంతృప్తిని ప్రధాని తగ్గించగలిగారని పార్టీ భావిస్తోంది. మిగిలిన అసంతృప్తి విషయాన్ని అమిత్ షా చూసుకుంటారని అంచనా వేస్తోంది. యూపీలో మరో జోన్ అయిన కాన్పుర్, గోరఖ్‌పూర్ బాధ్యతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్‌కు; వారణాసి, అవధ్‌లను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించారు.
ప్రధాని ప్రాధాన్యం
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi news) గత నెలలో, ఈ నెలలో పలుమార్లు యూపీలో పర్యటించారు. రూ.వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గత నెలలో ఒకేసారి తొమ్మిది వైద్య కళాశాలల్ని ప్రారంభించారు. ప్రస్తుతం కూడా యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు పర్యటనలు చేస్తూ భాజపాకు అనుకూల వాతావరణాన్ని సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. డిసెంబరు 8న పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి తొలి రథయాత్ర ప్రారంభించేందుకు భాజపా సన్నాహాలు చేస్తోంది. మరో రెండు ప్రాంతాల్లోనూ రథయాత్రలు ప్రారంభిస్తారు. వాటి తేదీలు ఇంకా ఖరారు కాలేదు.
ఇవన్నీ డిసెంబరు 25న లఖ్‌నవూలో ముగుస్తాయి. ఆరోజు జరిగే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ప్రభుత్వానికి, పార్టీ అధిష్ఠానానికి ఈ విషయంలో స్పష్టత ఏర్పడింది. ప్రధాని శుక్రవారం నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలతో సమావేశం నిర్వహించినట్లుగా చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'ప్రజల డిమాండ్‌కు తలవంచితే అవమానానికి గురైనట్లు కాదు'