ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న ఓ డంపర్ రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు సహా ఓ యువకుడిపై దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కన ఆగి ఉన్న మారుతీ కారును ఢీకొట్టి కొంత దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదచారులు, మారుతి కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు. దీంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. ఒక్కసారిగా ఘటనాస్థలిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆదివారం రాత్రి కాన్పుర్-లఖ్‌నవూ హైవేపై జరిగిందీ ప్రమాదం. మృతులను శంకుతల, శివానిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు తల్లీకూతుళ్లు. మరోవైపు డంపర్‌లో ఇరుకున్న కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. అందులో విమలేశ్ కుమార్, అతని కుమారుడు శివాంక్, అల్లుడు పూరణ్ దీక్షిత్ ఉన్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ట్రక్కు-కారు ఢీ.. ఐదుగురు మృతి..
రాజస్థాన్ సికార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, స్విఫ్ట్ కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ హరియాణాకు చెందినవారని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం ఫతేపుర్-సల్సార్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమవారం వేకువజామున జరిగిందీ దుర్ఘటన.
ఐదుగురు యువకులు మృతి..
లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కేరళ.. అలప్పుజలోని అంబాలప్పుజలో జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఉత్సవంలో అపశ్రుతి..
తమిళనాడు.. అరక్కోణంలోని ఆలయ ఉత్సవంలో అపశ్రుతి జరిగింది. క్రేన్ కుప్పకూలి నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. మృతులను భూబాలన్(40), జ్యోతిబాబు(16), ముత్తుకుమార్(39), చిన్నస్వామి(85)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రి తరలించామని పోలీసులు తెలిపారు. ఆలయ ఉత్సవాల్లో క్రేన్‌ను ఉపయోగించేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.