బంగాల్లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కారుపై దాడి జరిగింది. పశ్చిమ మిడ్నాపుర్‌లోని పంచకుడిలో స్థానికులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత తన పర్యటనను వాయిదా వేసుకున్నారు మురళీధరన్.
![Union Minister V Muraleedharan's car attacked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-05-06-at-134339_0605newsroom_1620289783_245.jpeg)
![Union Minister V Muraleedharan's car attacked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-05-06-at-134341-1_0605newsroom_1620289783_213.jpeg)
టీఎంసీకి సంబంధించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని మురళీధరన్ ఆరోపించారు. తాను క్షేమంగానే ఉన్నానని, కానీ డ్రైవర్‌కు గాయాలయ్యాయని స్పష్టం చేశారు.
'టీఎంసీ గూడాలు నా కాన్వాయ్‌పై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారు. నా పర్యటనను కుదించుకుంటున్నా' అంటూ మంత్రి ట్వీట్ చేశారు.
![Union Minister V Muraleedharan's car attacked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-05-06-at-134340-1_0605newsroom_1620289783_657.jpeg)
పరామర్శించేందుకు వెళ్తే..
బంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలోనే దాడి జరిగిందని పేర్కొన్నారు మురళీధరన్. ఒక్కసారిగా చాలా మంది మీదికి దూసుకొచ్చారని చెప్పారు.
మంత్రి వాహనశ్రేణిపై జరిగిన దాడిపై విచారణ జరపనున్నట్లు.. స్థానిక కొత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
మంత్రి కాన్వాయ్‌పైనే దాడి అంటే?
ఒక మంత్రి కాన్వాయ్‌పైనే దాడి జరిగిందంటే.. బంగాల్లో మరి ఎవరు సురక్షితంగా ఉన్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. దాడి వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని ఆరోపించారు.
''మంత్రి కాన్వాయ్‌పైనే దాడి జరిగిందంటే.. రాష్ట్రంలో ఎవరు సురక్షితంగా ఉన్నారు? ఇది రాష్ట్ర ప్రాయోజిత హింస. బంగాల్లో హింసను మేం ఖండిస్తున్నాం. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.''
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
మురళీధరన్‌పై దాడిని ఖండించిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. తృణమూల్ కాంగ్రెస్ హింస మితిమీరిపోతోందని అన్నారు.
ఇదీ చదవండి: బంగాల్ హింసపై కేంద్రం నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు