Manish Sisodia CBI Officer : తనను తప్పుడు ఎక్సైజ్ కేసులో ఇరికించాలనే ఒత్తిడి రావడంతో ఓ సీబీఐ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఆరోపించారు. ఎమ్మెల్యేలను లాగేసుకోవడం ద్వారా భాజపాయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడంపైనే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తున్నారని విమర్శలు చేశారు. గతేడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గత నెలలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆపై సిసోదియా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ క్రమంలోనే సిసోదియా సోమవారం మాట్లాడుతూ.. 'నన్ను తప్పుడు ఎక్సైజ్ కేసులో ఇరికించాలంటూ ఓ సీబీఐ అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆయన రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయమై కలత చెందా' అని తెలిపారు. 'ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా.. అధికారులపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? కావాలంటే నన్ను అరెస్టు చేయండి. కానీ, అధికారుల కుటుంబాలను నాశనం చేయొద్దు' అని ప్రధాని మోదీపై మండిపడ్డారు. 'ఆపరేషన్ కమలం' ఒక్కటే కేంద్రం చేస్తున్న పని కాదా? అని ప్రశ్నించారు.
ఆరోపణలను ఖండించిన సీబీఐ..
సంస్థ అధికారి ఆత్మహత్యపై మనీశ్ సిసోదియా చేసిన వ్యాఖ్యలను సీబీఐ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీపై జరుగుతోన్న దర్యాప్తునుంచి దృష్టి మళ్లించేందుకే సిసోదియా ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడింది. ప్రాణాలు కోల్పోయిన సీబీఐ అధికారికి.. ఎక్సైజ్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉందన్న సీబీఐ.. ఇప్పటివరకు ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని తెలిపింది.
ఇవీ చూడండి: 'న్యాయవ్యవస్థ నిరాడంబరంగా ఉండాలి.. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి'