Ukraine War: భారతీయులందరూ ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై నిర్వహించిన మీడియా సమావేశం విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఈ మేరకు వెల్లడించారు.
ఖార్కివ్, ఇతర యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా, అత్యవసరంగా తరలించే మార్గం కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలను భారత్ డిమాండ్ చేసినట్లు శ్రింగ్లా తెలిపారు. ఉక్రెయిన్‌లో 20 వేలమంది భారతీయులు ఉన్నట్లు అంచనా వేసిన విదేశాంగ శాఖ.. ఇప్పటికే 12వేల మంది (60 శాతం) ఉక్రెయిన్‌ను వీడినట్లు తెలిపింది. బుచారెస్ట్, బుడాపెస్ట్, పోలాండ్, స్లోవేకియా నుంచి మరో మూడు రోజుల్లో 26 విమానాల ద్వారా భారతీయులను తరలించనున్నట్లు తెలిపారు.
భారత పౌరుల తరలింపు కోసం 25 మంది అధికారులను అదనంగా పంపినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారత పౌరుల లేరని సమాచారం అందినట్లు విదేశాంగశాఖ పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయ సామగ్రి పంపినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నవీన్ మృతదేహాన్ని రప్పించేందుకు ప్రయత్నం
ఉక్రెయిన్ సంక్షోభంపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఖార్కివ్‌లో భారతీయ వైద్య విద్యార్థి నవీన్ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని శ్రింగ్లా చెప్పారు. వీలైనంత త్వరగా భారత పౌరుల తరలించడానికే కాకుండా నవీన్ మృతదేహాన్ని దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ఆ స్థానిక అధికారులుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: మోదీ ఉన్నతస్థాయి భేటీ- ఉక్రెయిన్ నుంచి పౌరుల తరలింపే లక్ష్యం