Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పౌరులను తరలించేందుకు చేపట్టిన 'ఆపరేషన్ గంగా' కార్యక్రమం విజయవంతమయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వేదికలపై భారత్ ప్రభావం పెరుగుతున్నందునే ఇది సాధ్యమయ్యిందని చెప్పారు. పుణెలో సింబయాసిస్ యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడారు.
"ఆపరేషన్ గంగా ద్వారా వేలాది మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి సురక్షితంగా తరలిస్తున్నాం. భారతదేశం శక్తిమంతం అవుతున్న కారణంగా ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతం నుంచి వేలాది మంది విద్యార్థులను మాతృభూమికి తిరిగి తీసుకురాగలిగాం.పెద్ద దేశాలు కూడా తమ పౌరులను ఉక్రెయిన్ నుంచి వెనక్కి తీసుకురావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి."
-ప్రధాని నరేంద్ర మోదీ
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 13,700 మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
150 ఎలక్ట్రిక్ బస్సులు..
మరోవైపు, పుణెలో ప్రజా రవాణాకు 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. బానర్ ప్రాంతంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా మోదీ ప్రారంభించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీదారి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. పుణె మహానగర పరివాహన్ మహామండల్ లిమిటెడ్ తరపున ఓలెక్ట్రా గ్రీన్ సంస్థ ఇప్పటికే నగరంలో 150 ఈ-బస్సులను నడుపుతోంది.
పుణెతో పాటు మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో భాగమైన ఈ సంస్థ.. సూరత్, ముంబయి, పుణె, సిల్వస్సా, గోవా, నాగ్‌పుర్, హైదరాబాద్, దెహ్రాదూన్లలోనూ ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.
"ఓలెక్ట్రా పుణె నగరంలో ప్రస్తుత 150 బస్సులకు తోడు మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను జతచేయడం గర్వకారణంగా ఉంది. సమర్థవంతమైన విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సంస్థ కట్టుబడి ఉంది." అని సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ తెలిపారు.
ఇదీ చదవండి: పుణె మెట్రో రైల్ ప్రాజెక్టుకు మోదీ శ్రీకారం.. ట్రైన్లో ప్రయాణం