Boris Johnson India Visit: భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ చేరుకున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆయనకు సీఎం భూపేంద్ర పటేల్ పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని బోరిస్ జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజల అనుబంధాన్నీ ఇనుమడింపజేస్తుందని తెలిపారు. తన పర్యటనను పురస్కరించుకొని బుధవారం బ్రిటన్ పార్లమెంటు దిగువసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 'నా భారత్ పర్యటన రెండు దేశాల సంబంధాలను మరింత వేళ్లూనుకునేలా చేస్తుంది. దిల్లీలో ప్రధాని మోదీని, పారిశ్రామివేత్తలను కలుస్తాను' అని జాన్సన్ తెలిపారు. తన ఆహ్వానం మేరకు కార్బిస్ బే జీ7 సదస్సులో మోదీ పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బోరిస్ జాన్సన్ గురవారం గుజరాత్లో వివిధ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి దిల్లీ వెళ్తారు. శుక్రవారం ప్రధాని మోదీతో, వాణిజ్య ప్రతినిధులతో భేటీ అవుతారు. తొలుత రాష్ట్రపతి భవన్లో జరిగే విందుకు హజరుకానున్న జాన్సన్.. అనంతరం మహాత్మ గాంధీ సమాధికి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సాయంత్రం భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జైశంకర్‌తో భేటీ కానున్నారు. కాగా గతేడాది భారత్-బ్రిటన్ వ్యూహాత్మక బంధంలో భాగంగా ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఒప్పందం జరిగింది.
బిలియన్ పౌండ్ల ఒప్పందాలు: బోరిస్ భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య బిలియన్ పౌండ్లు విలువ చేసే ఒప్పందాలు జరుగుతాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంలో ఇరు దేశాల మధ్య సరికొత్త శకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాల ద్వారా 11వేల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నట్లు చెప్పింది. దీని వల్ల ఇరు దేశాల బంధం మరింత బలపడుతుందని పేర్కొంది.
ఇదీ చదవండి: Boris Apology : 'అది పార్టీ అని అనుకోలేదు.. క్షమించండి'