ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జీ7 శిఖరాగ్ర సదస్సు ఆహ్వానం లభించింది. కార్న్‌వాల్‌లో జరిగే ఈ సమావేశానికి హాజరుకావాలని బ్రిటన్ ఆహ్వానం అందించింది. ఈ సదస్సుకు ముందే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది.
ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. భారత్‌ను ప్రపంచ ఔషధాలయంగా అభివర్ణించిన ఆయన.. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో భారతదేశ కృషిని కొనియాడారు. ప్రపంచంలోని టీకాలలో 50 శాతం భారత్‌లోనే తయారయ్యాయని గుర్తు చేశారు. మహమ్మారి సమయంలో ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేశాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
జూన్ 11-14 మధ్య జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఇందులో భారత్ సభ్యదేశం కానప్పటికీ ఆతిథ్య హోదాలో సమావేశంలో పాల్గొంటుంది. భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాధినేతలను సైతం బ్రిటన్ ఆహ్వానించింది.
ఇదీ చదవండి: జీ-7 సదస్సు: భారత్‌కు ఆహ్వానం.. అయినా ఆచితూచి..