Traveling 1500 km Bicycle: పర్యావరణ రక్షణపై యువతకు అవగాహన కల్పించడానికి సైకిల్ యాత్ర చేపట్టారు 73 ఏళ్ల డాక్టర్ కిరణ్ సేథ్. ఈ వయసులో 1500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈ యాత్రలో దాదాపు 2500 కిలో మీటర్లు ప్రయాణించనున్నారు. యువతకు పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికే సైకిల్ యాత్రను చేస్తున్నట్లు డాక్టర్ కిరణ్ సేథ్ తెలిపారు. సైకిల్‌తో కలిగే ప్రయోజనాలను యువతకు తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు. అంతకుముందు డిసెంబరులో కిరణ్ సేథ్.. పుదుచ్చేరి నుంచి చెన్నైకి సైకిల్ యాత్ర చేపట్టారు.
మార్చి 11, 2022న దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి.. తన సైకిల్ యాత్రను ప్రారంభించారు కిరణ్ సేథ్. దిల్లీలో మొదలైన ఈ యాత్రలో అల్వార్, జైపుర్, అహ్మదాబాద్, బరోడా, గోద్రా మీదుగా 1500 కి.మీ ప్రయాణించి ఉజ్జయిని చేరుకున్నారు. ఆయన ఉజ్జయినిలోని వివిధ విద్యా సంస్థల్లోని విద్యార్థులతో సమావేశం కానున్నారు. 50 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో రోజు 40 నుంచి 45 కిలో మీటర్లు సైకిల్ తొక్కానని సేథ్ చెప్పారు. జీవితాన్ని గడపడానికి సుఖవంతమైన జీవనం అవసరం లేదని.. సాధారణంగా జీవించడంలోనే జీవిత రహస్యం దాగి ఉందన్నారు.
ఇదీ చదవండి: వృద్ధుడి గొప్ప సంకల్పం.. మండుటెండలో 26 ఏళ్లుగా అదే పని..!