రాజస్థాన్‌లోని కోటా వద్ద ఆదివారం ఉదయం కారు నదిలోకి దూసుకెళ్లి పెళ్లి కొడుకు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వధూవరుల ప్రేమ కథ తెలిసి బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
మధ్యప్రదేశ్, ఉజ్జయిన్‌లోని భైరు నాలా ప్రాంతానికి చెందిన సుభాష్ కలోశియాకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కూతురు జయాకు ఫేస్బుక్ ద్వారా రాజస్థాన్, చౌత జిల్లాలోని బరవాఢా ప్రాంతానికి చెందిన అవినాశ్ వాల్మీకి పరిచయమయ్యాడు. ఇరువురి మధ్య స్నేహం ప్రేమగా మారింది. వారి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించటం వల్ల వివాహానికి ముహుర్తం ఖరారు చేశారు.
ముగ్గురు కుమార్తెల పెళ్లి ఒకే రోజు..
ముగ్గురు కుమార్తెల వివాహాన్ని ఒకేరోజు నిర్వహించేందుకు నిశ్చయించారు సుభాష్. మొదటి ఇద్దరు కూతుళ్ల బరాత్.. శనివారం సాయంత్రానికే ఉజ్జయిన్‌లోని విష్ణువాటికాకు చేరుకుంది. అయితే, చిన్న కుమార్తె జయ బరాత్.. రాజస్థాన్, చౌతలోని బర్వాడా నుంచి రాత్రి 2 గంటలకు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కోటాకు చేరుకున్న క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.
కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్ల వంతెన పై నుంచి చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడు అవినాశ్‌తో పాటు మొత్తం 9 మంది జలసమాధి అయ్యారు. మృతులంతా 35 ఏళ్లలోపు వారే కావటం గమనార్హం.
మరోవైపు.. ఈ ప్రమాదం జరిగినప్పటికీ ఇద్దరు పెద్ద కుమార్తెల వివాహ తంతు పూర్తి చేసినట్లు సమాచారం. కానీ, పెళ్లి పందిరిలో ఆ సంతోషమే లేకుండా పోయింది.
ఇదీ చూడండి: నదిలోకి దూసుకెళ్లిన కారు.. పెళ్లి కుమారుడు సహా తొమ్మిది మంది మృతి