UGC Dual Degrees: ఏకకాలంలో రెండు డిగ్రీలను కొనసాగించడానికి విద్యార్థులకు యుజీసీ అనుమతినిచ్చింది. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ మంగళవారం ప్రకటించారు. డిగ్రీలను ఒకే విశ్వవిద్యాలయంలో లేదా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కూడా పొందవచ్చని స్పష్టం చేశారు. భౌతిక తరగతులు లేదా ఆన్‌లైన్‌లోనూ డిగ్రీలను చదవడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేయనుందని తెలిపారు.
"కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యార్థులు బహుళ నైపుణ్యాలను పొందేందుకు వీలుగా ఒక అభ్యర్థి ఒకేసారి రెండు డిగ్రీలను చదవడానికి వీలుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తాం. వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి కూడా డిగ్రీలు చదువుకునే వీలుగా నిబంధనలను తయారు చేస్తాం."
-జగదీష్ కుమార్, యూజీసీ ఛైర్మన్
క్యాంపస్‌లలో హింసను నివారించాలి..
యూనివర్సిటీ క్యాంపస్‌లలో హింసను నివారించాలని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఇద్దరు విద్యార్థుల బృందాల మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావిస్తూ మాట్లాడారు. యూనివర్సిటీలోని కావేరీ హాస్టల్‌లో రామనవమి నాడు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణలతో హింస చెలరేగింది. ఘర్షణలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రిత్వ శాఖ జేఎన్‌యూను నివేదికను కోరింది.
ఇదీ చదవండి: సీఎం సభలో భద్రతా వైఫల్యం.. స్టేజీకి దగ్గరగా బాణసంచా పేలుడు