PM Modi Varanasi Visit: భారత నాగరికత, సంస్కృతి ఎన్నో దాడులు, కుట్రలను తట్టుకుని నిలిచిందని, దానిని ధ్వంసం చేసేందుకు ఔరంగజేబు లాంటి నిరంకుశులు ప్రయత్నించారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పురాతన పవిత్ర నగరం కాశీ దాని వైభవంలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ తరుణంలో అలాంటి దాడులు చరిత్రలోని చీకటి పుటల్లో కలిసిపోయాయన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో.. ప్రధాని మోదీ తన కలల ప్రాజెక్టు కాశీ క్షేత్ర అభివృద్ధి కారిడార్‌ను ప్రారంభించారు.
కాశీ విశ్వనాథ్ కారిడార్ కింద చేపట్టిన తొలి విడత పనులను రూ.339 కోట్లతో పూర్తి చేశారు. దివ్య కాశీ-భవ్య కాశీ పేరుతో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 3వేల మంది సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు కూడా పాల్గొన్నారు.
2019 మార్చిలో శంకుస్థాపన..
కాశీ విశ్వనాథ్ కారిడార్ పేరుతో చేపట్టిన తొలి దశ అభివృద్ధి పనుల కింద టెంపుల్ చౌక్, వారణాసి సిటీ గ్యాలరీ, ప్రదర్శనశాల, ఆడిటోరియాలు, హాళ్లు, ధ్యాన మందిరంతోపాటు భక్తులు, అర్చకుల బస కేంద్రాలు, ఆధ్యాత్మిక పుస్తక కేంద్రాన్ని నిర్మించారు. ఇందుకోసం పలు భవనాలను సేకరించి కూలగొట్టారు. రహదారులను విస్తరించారు. ఈ పనులకు 2019 మార్చిలో ప్రధాని మోదీ.. శంకుస్థాపన చేశారు.
విశ్వనాథుడి దయతో..
కార్మికులు, అధికార యంత్రాంగం సహా అంతా కష్టపడడం వల్లే కాశీ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయని ప్రధాని అన్నారు. ఈ పనులను ప్రారంభించిన సమయంలో కొంత మంది ఎగతాళి చేశారన్న ప్రధాని.. విశ్వనాథుడి దయతో వాటిని పూర్తి చేసినట్లు తెలిపారు. కాశీ అభివృద్ధి పనులతో కొత్త చరిత్ర లిఖితమైందన్న ప్రధాని.. ఈ పనులు దేశానికి నిర్ణయాత్మకమైన దిశ, భవిష్యత్తును చూపిస్తాయని తెలిపారు. కాశీ పట్టణం పురాతన, నూతన సంస్కృతుల సమ్మేళనం అని ప్రధాని పేర్కొన్నారు. ఔరంగజేబు లాంటి వ్యక్తులు కాశీ పట్టణంపై దాడి చేశారని, అయితే అలాంటి వ్యక్తులు ఎప్పుడు పుట్టినా, ఛత్రపతి శివాజీ లాంటి వ్యక్తులు కూడా జన్మిస్తారని ప్రధాని తెలిపారు.
" మన వారణాసి పట్టణం అనేక యుగాల నుంచి మనుగడలో ఉంది. చరిత్ర లిఖితం అవుతుంటే చూసింది. ఎన్ని కాలాలు వచ్చి వెళ్లినా వారణాసి అలాగే ఉంది. ఆక్రమణదారులు ఈ నగరాన్ని కబళించేందుకు యత్నించారు. నగరాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఔరంగజేబు ఆకృత్యాలు, దాడులకు చరిత్ర సాక్ష్యంగా ఉంది. భారతదేశ సంస్కృతిని ఔరంగజేబు కత్తి ద్వారా మార్చేందుకు యత్నించాడు. కాని భారతదేశ మట్టి మిగతా ప్రపంచంతో కాస్త భిన్నమైనది. ఒక వేళ భారత్‌కు ఔరంగజేబు వస్తే శివాజీ లాంటి వాళ్లు కూడా ఉద్భవిస్తారు. ఇలాంటి వీరయోధులు ఔరంగజేబు లాంటి వ్యక్తులకు దేశ ఐక్యతను చాటిచెబుతారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రాణి అహల్యాబాయి విగ్రహానికి నివాళులు..
కాశీ ఆలయాన్ని నిర్మించిన రాణి అహల్యాబాయి విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. కాశీ క్షేత్రంపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను వీక్షించారు. దివ్యకాశీ-భవ్య కాశీ కార్యక్రమాన్ని దేశంలోని 51వేల చోట్ల ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇందుకోసం అన్ని మండలాల్లోని ముఖ్య శివాలయాలు, ఆశ్రమాల్లో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:
'కాశీ కారిడార్.. దేశ సనాతన సంస్కృతికి ప్రతీక'
PM Modi Varanasi Visit: వారణాసిలో ప్రధాని మోదీపై పూలవర్షం