Types of Traffic Cameras and How Challan Gets Issued : నిత్యం వ్యక్తిగత వాహనాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోతోంది. అయినా.. ట్రాఫిక్ రూల్స్ అందరూ పక్కాగా పాటిస్తే.. సమస్య కొంత తగ్గుతుంది. కానీ.. చాలా మంది ఇష్టారీతిన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. ఇలాంటి వారిని పట్టుకోవడం ట్రాఫిక్ సిబ్బందికి గతంలో సవాలుగా ఉండేది. కానీ.. ఇప్పుడు సీసీ కెమెరాలు ప్రశాంతంగా కూర్చొని.. ఉల్లంఘనులను పట్టేస్తున్నాయి. అయితే.. చాలా మందికి ఒకటీ రెండు రకాల కెమెరాలు మాత్రమే తెలుసు. కానీ.. రోడ్డుపై ఎన్నిరకాల కెమెరాలు మిమ్మల్ని పరిశీలిస్తుంటాయో మీకు తెలుసా..?
రెడ్ లైట్ కెమెరా (Camera in Red Lite) :
ఫైన్ వసూలు చేయడానికే.. ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారని చాలా మంది భావిస్తుంటారు. కానీ.. ప్రజల భద్రతే వాటి ప్రధాన లక్ష్యం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద.. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ అంటూ.. మూడురకాల లైట్లు ఉంటాయి. కానీ.. వీటిని పట్టించుకోకుండా కొందరు వెళ్లిపోతూనే ఉంటారు. వారు ప్రమాదానికి గురికావడమే కాకుండా.. పక్కవారిని కూడా ప్రమాదంలోకి లాగుతారు. ఇలాంటి వారి ఆటకట్టించేందుకు రెడ్ లైట్ లో కెమెరా ఉంటుంది. గ్రీన్ తర్వాత వచ్చే ఎల్లో కలర్ వెలుగుతున్నంత సేపు రోడ్డు దాటేవారిని ఈ కెమెరాలు పట్టించుకోవు. ఎర్రలైటు వెలిగగానే యాక్టివేట్ అవుతాయి. సెన్సార్ ద్వారా ఫొటోలు తీస్తాయి. గీత దాటిన వారిపై వేటు వేస్తాయన్నమాట.
స్పీడ్ క్యాప్చర్ కెమెరా (Speed Capture Camera) :
ఈ కెమెరాలు.. విద్యుత్ స్తంభాలకో, చెట్లకో, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లకో.. ఇలా అక్కడక్కడా ఫిక్స్ చేసి ఉంటాయి. ఇవి వాహనాలు వెళ్లే స్పీడ్‌ను క్యాప్చర్ చేస్తుంటాయి. ఒక వాహనం వాటి పరిధిలోకి ప్రవేశించి.. వెళ్లిపోయేలోగా పని పూర్తి చేస్తాయి. ఈ సమయంలో మీ వాహనానికి సంబంధించి రెండు ఫొటోలను క్యాప్చర్ చేస్తాయి. ఈ స్పీడ్ కెమెరాలు వాహనం వెళ్తున్న వేగాన్ని లెక్కించడానికి.. మీ వాహనం విండ్‌షీల్డ్‌లోని స్టిక్కర్‌ను స్కాన్ చేస్తాయి. ఈ స్పీడ్ కెమెరాలు చాలా ఖచ్చితమైనవి. ఉదాహరణకు.. ఆ కెమెరా బిగించిన ప్రాంతంలో 40 కిలోమీటర్లకు మించిన వేగంతో వెళ్లకూడదనే నిబంధన ఉంటే.. మీరు 41 kmph వేగంతో వెళ్తున్నా కూడా.. వెంటనే పసిగట్టగలవు. 1 కిలోమీటర్ స్పీడే ఎక్కువ కదా అంటే ఒప్పుకోవు. అంత అక్యురేట్గా పనిచేస్తాయి మరి!
ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా (Automatic Number Plate Recognition Camera) :
పేరుకు తగ్గట్టుగానే.. ఆటోమేటిగ్గా నంబర్ ప్లేట్‌ను రికగ్నిషన్ చేస్తుందీ కెమెరా! మీ వాహనం నంబర్ ప్లేట్ డేటాను చదవడానికి, గుర్తించడానికి అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో ఓవర్‌వ్యూ కెమెరా కూడా ఉంటుంది. ఈ ANPR కెమెరాలు.. మీ వాహనం నిబంధనలు అతిక్రమిస్తే.. ఆ వివరాలను వెంటనే ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి పంపుతుంది.
రాడార్ కెమెరా (Radar based camera) :
ట్రాఫిక్ కమెరాలన్నింటిలో.. ఈ రాడార్ బేస్డ్ కెమెరాలు అత్యంత శక్తివంతమైనవి. ఎందుకంటే.. పైన చెప్పుకున్న కెమెరాలు చేసే పనులన్నీ.. ఇదొక్కటే చేయగలదు. ఇది ఓవర్ స్పీడ్, రెడ్ లైట్ జంపింగ్, హెల్మెట్ లేకుండా లేదా సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఉపయోగించడం.. ఇలాంటి ఏ పనిచేసినా.. గుర్తిస్తుంది. ఈ రాడార్ ఆధారిత కెమెరాలు.. 8 లేన్ల రహదారుల్లో దాదాపు 32 వాహనాలను ఏక కాలంలో కవర్ చేయగలవు. వాహన వేగాన్ని కొలిచేందుకు.. వాహనం నుండి వెనక్కి వచ్చే రేడియో తరంగాలను ఈ కెమెరా ఉపయోగిస్తుంది.
ఇ-చలాన్ ఇలా జారీ చేస్తారు (How to Issues E Challan) :
పైన చెప్పుకున్న కెమెరాలన్నీ తీసిన చిత్రాలను ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు పంపిస్తాయి. అక్కడ వాటిని పరిశిలీంచి మాన్యువల్‌గా మీకు ఇ-చలాన్ గిఫ్ట్‌గా ఇస్తారు. సో.. చూశారు కదా! ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మాత్రమే కెమెరా ఉందని.. అది దాటితే ఇబ్బంది లేదని భావించకండి. ఇంటిదాకా మీ ప్రయాణాన్ని కెమెరాలు గమనిస్తూనే ఉంటాయి. మీరు కూడా బాధ్యతగా వాహనం నడిపి.. భద్రంగా ఇల్లు చేరండి. ఎందుకంటే.. మీ కోసం మీ వాళ్లు ఎదురు చూస్తూ ఉన్నారు.