Twitter on new it rules: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐటీ చట్టాలపై ట్విట్టర్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలను సవాలుచేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా శక్తిమంతమైన సాధనమని.. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వీటి ప్రభావం అధికంగా ఉందన్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాలు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టం చేసిన ఆయన.. ఇవి ఎలా ఉండాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు జరుగుతోందన్నారు. ఐటీ చట్టాలకు సంబంధించి భారత ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విట్టర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సమయంలోనే కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'సామాజిక మాధ్యమాల జవాబుదారీ అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వాటిని జవాబుదారీగా ఉంచడం ఎంతో ముఖ్యం. ఇది తొలుత స్వీయ నియంత్రణ, అనంతరం పరిశ్రమ పరంగా, చివరగా ప్రభుత నియంత్రణ ఉండాల్సిందే' అని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. కంపెనీ ఏదైనా.. ఏరంగానికి చెందినదైనా.. భారత చట్టాలకు లోబడే పనిచేయాలని స్పష్టం చేశారు. పార్లమెంట్ చేసిన చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ఇక సామాజిక మాధ్యమాల వల్ల కంటెంట్ ప్రొడ్యూసర్లు ప్రయోజనం పొందుతున్నారని అనుకుంటే.. వారివల్ల మాధ్యమ వేదికలు కూడా ప్రయోజనం పొందుతున్నాయని కేంద్ర ఐటీశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.
కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ట్విట్టర్..: డిజిటల్ మాధ్యమాల్లో కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలు గతేడాది మే నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలను ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు పాటిస్తున్నప్పటికీ.. వివిధ కారణాలు చెబుతూ ట్విట్టర్ మాత్రం విముఖత చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వానికి, ట్విట్టర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జులై 4వ తేదీ లోగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఆదేశాలను ట్విట్టర్ పాటించాలని లేదంటే మధ్యంతర హోదా కోల్పోవాల్సి వస్తుందని భారత ప్రభుత్వం జూన్ నెలలో హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ తాజాగా కర్ణాటక హైకోర్టును ట్విట్టర్ ఆశ్రయించింది. ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా నిరంకుశంగా ఉన్నాయని ఆరోపించింది. దీనివల్ల రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్ట్ చేసిన కంటెంట్‌ను తొలగించాల్సి వస్తోందని, ఇది వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించినట్లేనని ట్విట్టర్ వాదించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: విద్యార్థిపై ఐఏఎస్ అధికారి లైంగిక వేధింపులు!