కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ గురువారం రాత్రి నిలిపేసింది. కొంతసమయం తర్వాత మళ్లీ పునరుద్ధరించినట్లు ప్రకటించింది. గ్లోబల్ కాపీరైట్ విధానాల కింద ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అసలేం జరిగిందంటే..
గురువారం రాత్రి అమిత్ షా ఖాతా నుంచి ప్రొఫైల్ చిత్రం మాయమైంది. దాని స్థానంలో "ఈ చిత్రం కనబడటం లేదు" అని ఉంది. అమిత్ షా ట్విట్టర్ ఖాతాలోని ఆయన ప్రొఫైల్ చిత్రంపై తనకు కాపీరైట్ ఉన్నట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. అనంతరం అమిత్ షా ప్రొఫైల్ చిత్రాన్ని తొలగించటంతోపాటు ఖాతాను నిలిపేసింది.
గ్లోబల్ కాపీరైట్ విధానాల కింద పొరపాటున అమిత్ షా ఖాతాను నిలిపేసినట్లు ట్విట్టర్ తెలిపింది. వెంటనే సరిదిద్దుకున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు.
ట్విట్టర్ చర్యపై నెటిజన్లు విమర్శలు చేశారు. కాపీరైట్ ఎవరు క్లెయిమ్ చేశారో చెప్పడంటూ ప్రశ్నించారు.
ఇదీ చూడండి: సోమవారమే సీఎంగా నితీశ్ ప్రమాణం!