ప్రమాదవశాత్తు ఓ గుడిసెలో జరిగిన అగ్నిప్రమాదానికి ముక్కుపచ్చలారని కవలలు బలయ్యారు. ఉయ్యాలలో నిద్రపోతూనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో ఈ విషాదం జరిగింది.
ఏం జరిగిందంటే..?
ఉదయ్‌పుర్ జిల్లా కోట్ఢా పోలీస్ స్టేషన్ పరిధిలోని జంబువా ఫలా గ్రామానికి చెందిన ఉజ్మా అనే వ్యక్తికి భార్య, ఆరు నెలల కవలలు ఉన్నారు. అయితే మంగళవారం చిన్నారులను ఉయ్యాలలో నిద్రపుచ్చి తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయారు. దీంతో మంటలు పొయ్యి నుంచి వారు నివసిస్తున్న గుడిసెకు అంటుకున్నాయి.
చిన్నారుల ఏడుపు విన్న తల్లిదండ్రులు, గ్రామస్థులు, వెంటనే అక్కడకు చేరుకుని.. అతికష్టం మీద వారిని బయటకు తీసుకొచ్చారు. కవలలను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఉదయ్‌పుర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చేసేదేంలేక.. చిన్నారులను ఉదయ్‌పుర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే వాళ్లు మృతిచెందారు.
సమాచారం అందిన వెంటనే కోట్ఢా స్టేషన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొయ్యిలోంచి ఎగిసిన మంటల కారణంగానే గుడిసెకు నిప్పంటుకున్నట్లు నిర్ధరించారు.
ఇదీ చూడండి: ట్రక్కు, బస్సు ఢీ- 11 మంది మృతి