జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లు 15 నిమిషాల వ్యవధిలో జమ్ము నగరంలోని నర్వాల్ ప్రాంతంలో సంభవించాయి. మొదటి పేలుడులో ఐదుగురు.. రెండో పేలుడులో మరో ఇద్దరికి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకున్నాయని జమ్ము ఏడీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు.
కాగా, ఆస్పత్రికి తరలించిన క్షతగాత్రులకు స్వల్పగాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పుడు వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఈ పేలుళ్లు నర్వాల్ ప్రాంతంలోని ఓ ట్రాన్స్‌పోర్టు యార్డులో సంభవించాయి. రిపేర్ కోసం వర్క్‌షాపునకు తీసుకువచ్చిన ఓ వాహనంలో మొదటి పేలుడు ఉదయం 10.45 గంటలకు జరిగిందని ప్రత్యక్ష సాక్షి, మోటార్ స్పేర్ పార్ట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు జస్విందర్ సింగ్ అనే వ్యక్తి తెలిపారు. దానికి సమీపంలోనే 15 నిమిషాల వ్యవధిలో మరో పేలుడు జరిగిందని తెలిపారు. ఉగ్రదాడుల అనుమానాలు, జమ్ముకశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర సాగుతుండడం, గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగనున్న తరుణంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి.