జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందంటూ తన ఇంటికి ట్యూషన్‌కు వచ్చే పిల్లలకు సెలైన్లు ఎక్కించాడు ఓ ప్రబుద్ధుడు. దిల్లీలోని మండవాలికి చెందిన సందీప్(20) అనే ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం బీఏ రెండో సంవత్సరం చదువుతున్న సందీప్.. 6-9 తరగతుల పిల్లలకు మండవాలిలోనే ట్యూషన్ చెబుతుంటాడు. ఓ విద్యార్థి తన ఇంటికి వెళ్లిన తర్వాత ఇంజెక్షన్ ఎక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండగా తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం అందింది.
యూట్యూబ్ చిట్కా!
ట్యూషన్ చెప్పే వ్యక్తి సెలైన్ ఎక్కిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయంపై నిందితుడిని ప్రశ్నించారు పోలీసులు. సెలైన్ ఎక్కిస్తే పిల్లలకు జ్ఞానం పెరుగుతుందని యూట్యూబ్‌లో చూశానని చెప్పుకొచ్చాడు సందీప్. దీంతో అవాక్కవ్వడం పోలీసుల వంతైంది.
ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు మండవాలి పోలీసులు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'అసోంను విడదీసేందుకు భాజపా-ఆర్ఎస్ఎస్ కుట్ర'