దిల్లీ అసెంబ్లీలో గురువారం ఓ అరుదైన నిర్మాణం బయటపడింది. సొరంగం తరహా మార్గాన్ని(Tunnel in assembly) తాము కనుగొన్నామని దిల్లీ శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు. ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోటను కలుపుతుందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సొరంగాన్ని బ్రిటిషర్లు వినియోగించేవారని చెప్పారు.
"నేను 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఎర్రకోటను కలిపే సొరంగ మార్గం దిల్లీ అసెంబ్లీలో ఉందని మాట్లాడుకోవడం విన్నాను. నేను ఆ చరిత్ర కోసం వెతికాను. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ, ఇప్పుడు మాకు ఈ సొరంగ ముఖద్వారం కనిపించింది. కానీ, దీన్ని మేము మరింత తవ్వాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మెట్రో పిల్లర్లు, డ్రైనేజీ కాల్వల కోసం దీన్ని చాలా వరకు పూడ్చేశారు."
-రామ్ నివాస్ గోయల్, దిల్లీ అసెంబ్లీ స్పీకర్
1912లో దేశ రాజధానిని కోల్కతా నుంచి దిల్లీకి తరలించిన తర్వాత... కేంద్ర శాసనసభగా ప్రస్తుత దిల్లీ అసెంబ్లీ భవనాన్ని వినియోగించారని నివాస్ గోయల్ తెలిపారు. 1926లో దీన్ని న్యాయస్థానంగా ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ సమయంలో స్వాతంత్య్ర సమరయోధులను బ్రిటిషర్లు ఈ సొరంగ మార్గం ద్వారా న్యాయస్థానానికి తీసుకువచ్చేవారన్నారు.
వచ్చే స్వాతంత్య్ర వేడుకల నాటికి..
"ఈ ప్రాంతంలో ఓ ఉరికంబపు గది(Gallows room in delhi assembly) ఉందన్న విషయం అందరికీ తెలుసు. కానీ, ఇంతవరకు దాన్ని ఎప్పుడూ తెరవలేదు. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన నేపథ్యంలో నేను ఆ గదిని పరిశీలించాలని నిశ్చయించుకున్నాను. ఆ గదిని స్వాతంత్య్ర సమరయోధుల స్మృతి నిలయంగా మార్చి, వారికి నివాళి అర్పించాలనుకుంటున్నాం" అని నివాస్ గోయల్ తెలిపారు. ఆ గదిని వచ్చే స్వాతంత్య్ర వేడుకల నాటికి పర్యటకులకు అనుమతించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ ప్రభుత్వం విఫలం'
ఇదీ చూడండి: 'కుల ధ్రువీకరణపై పదేపదే విచారణ హానికరం'