Tulip Garden World Book Of Records : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. జబర్వాన్ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉన్న ఈ తులిప్ గార్డెన్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 68 రకాల 1.5 మిలియన్ల తులిప్ పువ్వులతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ రికార్డు సృష్టించింది.
Srinagar Tulip Garden Record : తులిప్ గార్డెన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్, గార్డెన్స్ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు. ఈ గార్డెన్‌ను ఆసియాలోనే అతిపెద్ద తులిప్ స్వర్గంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ దిలీప్ ఎన్ పండిత్, కశ్మీర్ అధికారులు, గార్డెనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

'ఇదొక చరిత్రాత్మక విజయం..'
ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ గొప్పతనాన్ని గుర్తించినందుకు.. వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ బృందానికి కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక విజయంగా వర్ణించారు. కశ్మీర్లో పూల సంపద.. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం.. మానవులు, ప్రకృతి మధ్య ఉన్న బంధానికి ప్రతీక అంటూ అభివర్ణించారు.
'ఈ ఘనత.. గార్డెన్ అందాన్ని..'
ఈ ఘనత సాధించినందుకు తులిప్ గార్డెన్ సెంట్రల్ వర్కింగ్ కమిటీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రెసిడెంట్ సంతోశ్ శుక్రా అభినందనలు తెలిపారు. ఈ గుర్తింపు.. ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అసమానమైన అందాన్ని చాటి చెబుతుందని అన్నారు. ప్రకృతి వైభవానికి ఈ ఘనత ఒక చిహ్నంగా ఉంటుందని చెప్పారు.
Srinagar Tulip Garden : ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్‌లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్‌లు విస్తరించి ఉంది. ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్‌ను తెరుస్తారు. తులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో లక్షలమంది పర్యటకులు తరలివస్తారు.