Trip For Bedridden Patients : కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సామాజిక సేవా సంస్థ 'కోస్టల్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్' వినూత్న ప్రయత్నం చేసింది. అనేక ఏళ్లుగా మంచానికే పరిమితమైన ఉన్న వారిని పర్యటక ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు విశేష కృషి చేసింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఆరుగురిని ఎంపిక చేసి ఒక రోజు ట్రిప్‌కు తీసుకెళ్లింది. ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది.
కోస్టల్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ మంగళూరు.. దక్షిణ కన్నడ జిల్లాలోని పెర్నె, కల్లపు, కుత్తార్, తొక్కోట్, ఉల్లాల్‌లో మంచానికి పరిమితమైన ఆరుగురిని ఎంపిక చేసింది. ఆరుగురితో పాటు వారి కుటుంబసభ్యులకు మంగళూరులోని పలు పర్యటక ప్రాంతాలను చూపించింది. సోమవారం ఉదయం బీఎంఎల్ హోటల్లో టీ తాగిన తర్వాత వీరి ట్రిప్ ప్రారంభమైంది.
రూ.5వేల షాపింగ్
ముందుగా మంగళూరులోని బయోలాజికల్ పార్క్‌కు అందరినీ తీసుకెళ్లారు కోస్టల్ ఫ్రెండ్స్ సంస్థ సభ్యులు. ఆ తర్వాత పిలికుల నిసర్గ ధామలో బోటింగ్ అయ్యాక.. మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తన్నీర్బావి బీచ్‌కు తీసుకెళ్లి అక్కడ ట్రీపార్క్ చూపించారు. ఆ తర్వాత నగరంలో ఫిజా నెక్సెస్ మాల్‌కు తీసుకెళ్లి మాల్ అంతా తిప్పి చూపించారు. ఒక్కకొక్కరికి రూ.5 వేల చొప్పున షాపింగ్ కూడా చేశారు. అనంతరం ఎవరి స్వస్థలాలకు వారిని చేరవేశారు.
ఆరు అంబులెన్స్‌లు.. ఇద్దరు నర్సులు..
ట్రిప్ సమయంలో లేవలేని వారిని మంచంపైనే అని ప్రాంతాలకు తీసుకెళ్లారు కోస్టల్ ఫ్రెండ్స్ సంస్థ సభ్యులు. కూర్చోగలిగే వారిని వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లారు. వారి కోసం ఆరు ప్రత్యేక అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తికి ఆరుగురు వాలంటీర్లు సేవలందించారు. ఇద్దరు నర్సులు వారి బాగోగులు చూసుకున్నారు.
'మా ఉద్దేశం అదే'
మంచాన పడ్డ వారి జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తమ ఉద్దేశమని కోస్టల్ ఫ్రెండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు షరీఫ్ అబ్బాస్ తెలిపారు. తమలాగే ఇతర సామాజిక సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. "మేం సామాజిక సేవ చేస్తునప్పుడు చాలా ఏళ్లుగా మంచాన పడ్డ వారిని గమనించాం. వాళ్ల కోసం ఒక ట్రిప్ ప్లాన్ చేశాం. అన్ని ఏర్పాట్లు చేసి తీసుకెళ్లాం" అని కోస్టల్ ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ తెలిపారు.
'చాలా ఆనందంగా ఉంది'
మూడేన్నరేళ్లుగా మంచానికి పరిమితమై ఉన్నానని మహ్మద్ ఇర్ఫాన్ తెలిపారు. కోస్టల్ ఫ్రెండ్స్ టీమ్ మమ్మల్ని ట్రిప్‌కు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. బోటింగ్, షాపింగ్ మాల్లో చాలా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు.