కొవిడ్ విజృంభణ దృష్ట్యా కోల్‌కతాలో చిన్న సమావేశాలను మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు. మిగిలిన మూడు విడతల ఎన్నికల కోసం జిల్లాల్లో తన ప్రసంగ వ్యవధిని గంట నుంచి సుమారు 20 నిమిషాలకు కుదిస్తున్నట్లు స్పష్టంచేశారు. దాంతో సభల్లో ప్రజలు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
"వచ్చే మూడు దశల పోలింగ్ కోసం వీధుల్లో చిన్న చిన్న సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భారీ బహిరంగ సభలను నిర్వహించబోము. నా ప్రసంగం కూడా మునుపటిగా కన్నా తక్కువ వ్యవధిలో ఉంటుంది."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
శాసనసభ ఎన్నికల వేళ బంగాల్లో కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 8,419 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,59,927కి చేరింది. మరో 8 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు 10,568 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చూడండి: రెమ్‌డెసివిర్‌పై 'మహా' జగడం!