పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వా గార్గ్‌కు అనూహ్య అనుభవం ఎదురైంది. ఈ నెల 6న(బుధవారం) ఆమె కార్యాలయంలో నిర్వహించిన ఓ అధికారిక సమావేశంలో విషపూరితమైన వాటర్ బాటిల్ దర్శనమిచ్చింది. గార్గ్ వ్యక్తిగత సిబ్బందే ఈ నీటిని సరఫరా చేసినట్టు తెలుస్తోంది.
బాటిల్లో తాగునీటికి బదులుగా రంగులేని కల్తీ ద్రవాన్ని గుర్తించిన గార్గ్.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం అక్కడి ప్రత్యేకాధికారి సురేశ్ రాజ్.. ఈ విషయమై దర్యాప్తు కోరుతూ ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై ఐపీసీ సెక్షన్-284 కింద కేసు(విష పదార్థాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం) నమోదు చేశారు పోలీసులు. అనంతరం స్థానిక డీజీపీ బీ. శ్రీవాస్తవ ఆదేశాల మేరకు సీబీ-సీఐడీ(క్రైమ్ బ్రాంచ్-క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్)కి దర్యాప్తు కోసం బదిలీ చేశారు. సంబంధిత అధికారులు విచారణ చేపడతారని డీజీపీ తెలిపారు.
వాటర్ బాటిల్ వ్యవహారంపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి.. దిగ్భ్రాంతికి లోనయ్యారు. కలెక్టర్ నుంచి వచ్చిన ఆ ఫిర్యాదు పత్రాన్ని ఆమె మీడియాకు పంపారు.
ఇదీ చదవండి: తల్లీబిడ్డలను మోస్తూ మంచులో 3.5కి.మీ నడక