School Holidays in Telangna : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇవాళ కూడా సెలవు ప్రకటించింది. గురువారం, శుక్రవారం విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు మాత్రమే శనివారం సెలవు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాల మధ్య విద్యాశాఖ శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వరుసగా మూడు రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చినట్లైంది. ఫలితంగా ఆదివారంతో కలుపుకొని మొత్తం నాలుగు రోజులు పిల్లలకు సెలవులు వచ్చాయి.
రాష్ట్రంలో వానలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఈ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమీక్షలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్ష బీభత్సం, ప్రాజెక్టుల వద్ద ప్రవాహం, గ్రామాల్లో చెరువుల పరిస్థితి గురించి అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. అన్ని జలాశయాల వద్ద భద్రత పెంచాలని... ముంపు ప్రాంతాలపై ప్రత్యేకదృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముఖ్యంగా బలహీనంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులను మరోసారి తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల పురాతన పాఠశాలలు శిథిలా వస్థకు చేరుకున్నాయి. భారీవర్షాలకు స్లాబులు, గోడలు నాని కూలే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడం, వంతెనలు మునిగిపోవడంతో.. ఆయా గ్రామాలకు వెళ్లి రావడం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లలకు సెలవు మంజూరు చేయాజమే మంచిదని ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రభుత్వం శనివారం కూడా సెలవు ప్రకటించింది. వచ్చే 48 గంటల తరువాత ఆదివారం పరిస్థితిని సమీక్షించిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
School Holidays : మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం ఒడిశా, రెండు తెలుగు రాష్ట్రాలపై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు అల్పపీడన ద్రోణి వల్ల ఆవర్తనం ఏర్పడింది. దీని ఫలితంగా వచ్చే 48 గంటల పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఇప్పటికే సూచించారు.
ఇవీ చదవండి: