Tomato Price Hike : లాటరీ తగిలి కోటీశ్వరుడిగా మారాడని చాలా సార్లు వినే ఉంటాం. పంట సాగు చేసి ఒక్క నెలలోనే కోటీశ్వరుడిగా మారిన రైతు గురించి విన్నారా? కేవలం నెల రోజుల్లో 13,000 పెట్టెల టమాటాలను విక్రయించి కోటీశ్వరుడిగా మారిపోయాడు పుణెకు చెందిన ఓ రైతు. ఆయన కథేంటో తెలుసుకుందాం..
Tomato Price Pune : మహారాష్ట్ర పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్కు 18 ఎకరాల భూమి ఉంది. ఇందులో 12 ఎకరాల్లో టమాటాలు.. మిగిలిన 6 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నాడు. టమాటాల సాగులో సరైన అవగాహన ఉండడం వల్ల దిగుబడి బాగా వచ్చింది. దీంతో ఒక్క నెలలో 13,000 పెట్టెల టమాటాలను విక్రయించి కోటీశ్వరుడయ్యాడు. నెల రోజుల్లోనే అతడికి దాదాపు రూ.కోటిన్నరకు పైగా ఆదాయం వచ్చింది. ఒక పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్ మార్కెట్లో విక్రయించాడు తుకారాం. శుక్రవారం ఒక్కరోజే సుమారు 900 పెట్టెల టమాటాలను అమ్మి రూ. 18 లక్షలు సంపాదించాడు.
తుకారాంకు అతడి కుమారుడు ఈశ్వర్ గాయకర్తో పాటు కోడలు సోనాలి సైతం సాయం చేసేవారు. సోనాలి.. విత్తనాలు నాటడం నుంచి ప్యాకేజింగ్ వరకు చూసుకోగా.. మార్కెట్‌కు తరలించడంలో ఈశ్వర్ సాయపడేవాడు. నారాయణ్‌గంజ్‌లోని ఝున్ను వ్యవసాయం మార్కెట్లో కిలో టమాటా ధర రూ.125 పలుకుతోంది. 20 కిలోల డబ్బా రూ.2,500కు అమ్ముతున్నారు.
వంకాయలతో టమాటాలు అంటుకట్టి.. కోటీశ్వరుడిగా మారి..
Tomato Price Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ ధమ్తరి జిల్లాకు చెందిన రైతు కూడా టమాటాలు పండించి కోటీశ్వడయ్యాడు. దాదాపు 150 ఎకరాల్లో టమాటాలు సాగు చేశాడు అరుణ్ సాహూ. రోజుకు 600 నుంచి 700 టమాటాల పెట్టెలు విక్రయించి కోటీశ్వరుడిగా మారిపోయాడు.
ధమ్‌తరికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిరన్పుర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ సాహూ 300 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత మక్కువతో వ్యవసాయం వైపు మళ్లాడు సాహూ. మొదట్లో సంప్రదాయ పద్ధతిలో పంటలు సాగు చేసేవాడు. దీంతో వర్షాలకు పంట బాగా దెబ్బతింది. ఆ తర్వాత హైటెక్ పద్ధతిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అతడికి ఉన్న 300 ఎకరాల్లో దాదాపు 150 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాడు. వంకాయ మొక్కతో టమాటాలకు అంటు కట్టి సాగు చేశాడు సాహూ. ఇది సత్ఫలితాలు ఇచ్చి వర్షాలను సైతం తట్టుకుని పంట నిలబడింది. ఫలితంగా రోజుకు 600-700 టమాటా పెట్టెలను విక్రయిస్తున్నాడు సాహూ. మిగతా రైతుల పంటలు వర్షాలకు ధ్వంసమైనా.. అతడు చేస్తున్న ఆధునిక పద్ధతులతో టమాటాలు బాగా పండాయి.
ఇవీ చదవండి : టమాటాల వ్యాన్ హైజాక్.. 2500 కిలోల సరకుతో పరార్
'టమాటాలకు బౌన్సర్ల' ఘటనలో ట్విస్ట్.. వ్యాపారిపై కేసు నమోదు.. పరారీలో ఎస్పీ నేత