రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సమావేశం కానున్నారు. దృశ్య మాధ్యమం ద్వారా ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. టీకా పంపిణీ, రాష్ట్రాల్లోని పరిస్థితులు, ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు.
డ్రై రన్ ఫలితాల ఆధారంగా మార్గదర్శకాల్లో కేంద్రం పలు మార్పులు చేసి వ్యాక్సిన్ పంపిణీ చేపడుతుందని ఇప్పటికే స్పష్టం చేశాయి అధికారవర్గాలు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది కొవిడ్ వారియర్స్‌కు తొలిదశలో ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగిలిన వారికి సంబంధించి ప్రధానితో ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది.
ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా పంపిణీకి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి తెలిపిన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: 7 నెలల్లో 33వేల టన్నుల కొవిడ్ వ్యర్థాలు!