గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో తృణమూల్ పార్టీ కార్యకర్త మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బంగాల్లోని మెదినీపుర్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది.
శౌభిక్ దౌల్తో పాటు మరో ఇద్దరు తృణమూల్ కార్యకర్తలు అభిరామ్పురం అనే గ్రామంలోని ఓ కల్వర్టు మీద రాత్రి 9 గంటలకు కూర్చోని ముచ్చటిస్తున్నారు. అకస్మాత్తుగా బైక్పై వచ్చిన ముగ్గురు..అక్కడ కూర్చున్న వారిపై బాంబులు విసిరారు. భయంతో అక్కడినుంచి పారిపోతున్న దౌల్ను తుపాకీతో కాల్చారు అని పోలీసులు తెలిపారు.
గాయపడిన ముగ్గురిని ఖరగ్పుర్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా దౌల్ మృతి చెందాడని పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనలో భాజపా కార్యకర్తల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ స్థానిక తృణమూల్ నేత వారిపై ఫిర్యాదు చేశారు. ఈ హత్యలో తమ కార్యకర్తల ప్రమేయం లేదని భాజపా జిల్లా అధ్యక్షుడు సమిత్ దాస్ తెలిపారు. తృణమూల్ పార్టీలోని అంతర్గతకలహాల ఫలితమే ఈ ఘటన అని అన్నారు.
ఇదీ చూడండి: ఎర్రకోట ఘటనలో ప్రముఖ రైతు నేత అరెస్టు