బంగాల్ రాజకీయాల్లో కీలక నేతగా పేరున్న సువేందు అధికారి శనివారం భాజపాలో చేరారు. కాషాయ పార్టీలో చేరడానికి కొద్ది గంటల ముందు టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఏ ఒక్కరి శ్రమ వల్లనో టీఎంసీ పార్టీ నిర్మాణం కాలేదంటూ ఆ లేఖ ద్వారా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
" తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి శ్రమతోనో నిర్మాణం కాలేదు. బంగాల్ గానీ, టీఎంసీ పార్టీ గానీ ఎవరి వ్యక్తిగతానికి సంబంధించినవి కావు. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచనలతో ఉన్నారంటే.. వారికి నిజం తెలియనట్లే. ఎంతో మంది శ్రమిస్తేనే పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో నిర్మాణం అయింది"
- సువేందు అధికారి
బంగాల్లో టీఎంసీ అధికారంలో రావడానికి నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ఆ ఉద్యమంలో సీఎం మమతా బెనర్జీకి సహకారం అందించడంలో సువేందు అధికారిది కీలక పాత్ర. కానీ ఇటీవల టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ ఉన్నత పదవుల్ని ఆమె మేనల్లుడు అభిజిత్ బెనర్జీకి కట్టబెట్టాలని చూస్తున్నట్లు వార్తలు రావడంతో పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సువేందు టీఎంసీ పార్టీతో పాటు తన ఎమ్యెల్యే పదవికి కూడా రాజీనామా చేసి షా సమక్షంలో భాజపాలో చేరారు. ఆయనతో పాటు ఇంకా పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరడంతో బెంగాల్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఇదీ చూడండి: వచ్చే ఎన్నికల్లో భాజపాదే అధికారం: సువేందు