బంగాల్లో అధికార టీఎంసీకి అసమ్మతి నేతల సెగ ఎదురవుతోంది. అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ శుక్రవారం రాజీనామా చేయగా.. ఆ తర్వాత కొద్ది గంటలకే ఎమ్మెల్యే బైశాలి దాల్మియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బైశాలి దాల్మియా.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు దివంగత జగ్‌మోహన్ దాల్మియా కుమార్తె కావడం గమనార్హం.
రాజీవ్ బెనర్జీ, బైశాలి దాల్మియా గత కొంతకాలంగా సొంతపార్టీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దురూ త్వరలోనే భాజపాలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి భాజపా గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేతలు పార్టీని వీడుతుండటం అధికార టీఎంసీని కలవరానికి గురి చేస్తోంది.
అణచివేస్తున్నారనే బయటకు..
అటవీ శాఖ మంత్రి రాజీనామా చేయడంపై బంగాల్ భాజపా నేత కైలాశ్ విజయ వర్గీయ స్పందించారు. టీఎంసీ నేతలు సొంత పార్టీలో అణచివేతకు గురవుతున్నారని ఆ అసమ్మతితోనే బయటకు వస్తున్నారని అన్నారు.