ఎన్నికల విధుల కోసం బంగాల్లో మోహరించిన కేంద్ర బలగాలు భాజపాకు అనుకూలంగా ప్రవరిస్తున్నాయని టీఎంసీ ఆరోపించించి. యశ్వంత్ సిన్హా సారథ్యంలోని ఆ పార్టీ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఎంసీ ఉపాధ్యక్షుడు, బంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కూడా ఈ బృందంలో ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో కూర్చొని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా హుకుం జారీ చేస్తున్నారని సిన్హా ఆరోపించారు. వారి సూచన మేరకే కొన్ని పోలింగ్ స్టేషన్లలో కేంద్ర బలగాలు భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
" బంగాల్లో ఇప్పటివరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో కేంద్ర బలగాల పాత్ర పక్షపాతంగా ఉందని ఈసీకి ఫిర్యాదు చేశాం. కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. మా పార్టీ మద్దతుదారులపై భాజపా దాడులకు పాల్పడింది. తదుపరి 6 విడతల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని అడిగాం. బంగాల్ ప్రజా తీర్పును మార్చేలా ప్రభావితం చేసేందుకు అమిత్ షా శత విధాలా ప్రయత్నిస్తున్నారు. టీఎంసీ మద్దతుదారులను ఓటింగ్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు. ఇది ఆగాలి."
--యశ్వంత్ సిన్హా, టీఎంసీ ఉపాధ్యక్షుడు.
భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో టీఎంసీనే భారీ మెజార్టీతో గెలుస్తుందని యశ్వంత్ సిన్హా ధీమా వ్యక్తం చేశారు.
50 ఏళ్లుగా ఎన్నడూ లేదు..
తాను 50 ఏళ్లుగా ఎన్నికలను చూస్తున్నానని, గతంలో ఏనాడూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ తరహాలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం చూడలేదని టీఎంసీ ఉపాధ్యక్షుడు సుబ్రతా ముఖర్జీ అన్నారు.
తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో కేంద్ర బలగాలు భాజపా పక్షాన నిలిచాయని బంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గురువారం ఆరోపించారు.