Praveen nettaru nia: కర్ణాటక ఐటీ శాఖ మంత్రి సీ అశ్వథ్‌నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భాజపా యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్యపై స్పందిస్తూ.. ఎన్కౌంటర్లకు సమయం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి హత్యలు జరగకుండా చూస్తామని చెప్పారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని.. ఇలాంటి హత్యలకు పాల్పడే వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన భాజపా యువమోర్చ నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య కేసుపై అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ప్రకటించారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు సేకరించాక.. కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామన్నారు. డీజీపీతో సమావేశమైన ముఖ్యమంత్రి.. కేరళ సరిహద్దులో భద్రతను పటిష్ఠం చేయాలని సూచించారు. సీసీటీవీలతో పాటు, చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మంగళవారం దుండగుల చేతిలో హత్యకు గురైన దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన భాజపా యువనాయకుడు ప్రవీణ్ నెట్టార్ ఇంటికి.. గురువారం సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పరామర్శకు వెళ్లారు. ప్రవీణ్ కుటుంబానికి సీఎం.. రూ.25 లక్షల చెక్కును అందజేసి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు కూడా కట్టిస్తామని తెలిపారు.
మరోవైపు గురువారం హత్యకు గురైన మహ్మద్ ఫాజిల్ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫాజిల్ అంత్యక్రియల నేపథ్యంలో.. ఉద్రిక్తతలు తలెత్తకుండా మంగళూరు నగర శివార్లలో ఉన్న సూరత్కల్ ప్రాంతంలో జులై 30 వరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తునట్లు ప్రకటించారు పోలీసులు. సూరత్కల్, ముల్కీ, బజ్పే, పణంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
ఇటీవల కర్ణాటకలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో భాజపా యువనేత ప్రవీణ్ నెట్టారు దారుణహత్య మరువక ముందే గురువారంమరో ఘటన జరిగింది. మంగళూరు నగరంలో గురువారం సాయంత్రం మహ్మద్ ఫాజిల్ అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సూరత్కల్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణం వద్ద ఉన్న ఫాజిల్‌ను.. మాస్కులు వేసుకుని వచ్చిన నలుగురు దుండగులు.. కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఫాజిల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: 'నోరు జారా.. క్షమించండి'.. రాష్ట్రపతి ద్రౌపదికి అధీర్ రంజన్ లేఖ
ఆన్లైన్లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్.. ఓపెన్ చేసి చూస్తే...