రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని ఉద్ఘాటించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. కొత్త వ్యవసాయ చట్టాలు.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చినట్లు మరోసారి స్పష్టం చేశారు.
వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సిద్ధమని తాము అన్నామంటే.. అందులో సమస్య ఉన్నట్లు కాదని పేర్కొన్నారు తోమర్. చట్టాల్లో ఒక్క లోపాన్ని కూడా విపక్షాలు ఎత్తిచూపలేకపోయాయని అన్నారు. రైతుల నిరసనలు ఒక్క రాష్ట్రానికే పరిమితమయ్యాయని, వారే అపార్థం చేసుకున్నారని రాజ్యసభకు తెలిపారు. రైతులందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
కనీస మద్దతు ధర ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని తెలిపిన తోమర్.. సాగు మౌలిక సదుపాయాల కోసం రూ. లక్ష కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
''రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సాగు రంగంలో పెట్టుబడులు పెంచేందుకు యత్నించాం. సాగు చట్టాల సవరణకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించాం. సవరణకు సిద్ధం అంటే చట్టాల్లో సమస్య ఉందని కాదు. భూములు ఆక్రమణకు గురవుతాయని రైతులు భయపడ్డారు. అలాంటి నిబంధనలేమీ చట్టాల్లో లేవు. రైతుల జీవితాలను మార్చాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం.''
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
రైళ్లలో రవాణా ఎవరైనా ఊహించారా?
రైళ్లలో పండ్లు, కూరగాయల రవాణాను ఎవరైనా ఊహించారా? అన్న తోమర్.. వాటి కోసం ఇప్పటికే 100 కిసాన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసి జీడీపీని పెంచాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. జీడీపీ వృద్ధిలో సాగు చట్టాల అమలు కీలకం కాబోతోందని అన్నారు.
ఇదీ చూడండి: 'రైతులు తమ హక్కుల కోసం పోరాడాలా?'