Thummala Comments on Assembly Elections 2023 : ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా వస్తానని పేర్కొన్నారు. మీతో శభాష్ అనిపించుకుంటానని.. అప్పటి వరకూ తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తల నరుక్కుంటా కానీ.. తలవంచనని పునురుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో తనను తప్పించానని కొందరు ఆనందపడొచ్చని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Tummala Nageswara Rao Interesting Comments : తాను ఎవరినీ నిందించ తలచుకోలేదని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోనే ఉందని.. జిల్లా అభివృద్ధి కోసం జీవితం అంకితం చేశానని తెలిపారు. కొందరు పరాన్నభుక్కులు కొన్ని ఎత్తులు వేయవచ్చని అన్నారు. ఎందరో నాయకుల వల్లకానివి.. తాను చేసి చూపించినట్లు తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
"ఈ ఎన్నికల్లో నన్ను తప్పించానని కొందరు ఆనందపడొచ్చు. నేను ఎవరినీ నిందించదలచుకోలేదు. నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉంది. జిల్లా అభివృద్ధి కోసం నా జీవితం అంకితం చేశాను. కొందరు పరాన్నభుక్కులు కొన్ని ఎత్తులు వేయవచ్చు. ఎందరో నాయకుల వల్లకానివి.. నేను చేసి చూపించా." - తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి
అంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం నుంచి.. సుమారు 1000 కార్లు, 2000 బైక్‌లతో భారీ ర్యాలీగా ఖమ్మంకు చేరుకున్నారు. ఓపెన్ టాప్ కారులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. ర్యాలీలో కేవలం ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు మాత్రమే దర్శనమిచ్చాయి. మరోవైపు భారత్ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాలు ప్రకటించగా.. అందులో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడంతో.. ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే పాలేరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. అనంతరం సత్తుపల్లి, ఇల్లందు, వైరా, మధిర నియోజకవర్గాల్లోనూ తుమ్మల వర్గం అంతర్గత సమావేశాల్లో అనుచరగణం భారీగా హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు బరిలో తుమ్మల పోటీ చేయాల్సిందేనని వారు నిర్ణయించారు. తుమ్మల నాగేశ్వరరావు ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా.. తామంతా ఆయన వెంటే నడుస్తామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తుమ్మల నాగేశ్వరావును బుజ్జగించేందుకు బీఆర్ఎస్ హైకమాండ్.. ముఖ్య నాయకులను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హైదరాబాద్‌లో ఆయనను కలిశారు. బుధవారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రత్యేకంగా భేటీ అయి.. సీఎం కేసీఆర్ సూచించిన అంశాలను వివరించినట్లు తెలిసింది.
MP Nama Nageswara Rao meet Tummala : అసంతృప్తులకు బుజ్జగింపులు.. తుమ్మలతో నామ భేటీ