సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నా.. కొన్నింటిపైనే ప్రజల్లో అమితాసక్తి ఉంటుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ ఎవరిని రంగంలోకి దింపుతోంది? వారు గెలిచే అవకాశాలు ఎన్ని? ఇలా అనేక ప్రశ్నలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటి నియోజకవర్గాల్లో కేరళ 'త్రిస్సూర్' ఒకటి. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న పోలింగ్ జరగనున్న వేళ.. త్రిస్సూర్ సమరం మళ్లీ తెరపైకి వచ్చింది.
రెండు దశాబ్దాల అనంతరం త్రిస్సూర్ అసెంబ్లీ సీటును 2016లో దక్కించుకుంది ఎల్డీఎఫ్. అంతకుముందు అక్కడ యూడీఎఫ్‌దే హవా. అక్కడ మరోమారు తమ జెండా ఎగరేయాలని ఎల్డీఎఫ్ భావిస్తుంటే.. తమ కంచుకోటను తిరిగి దక్కించుకోవాలని యూడీఎఫ్ శ్రమిస్తోంది. ఈ యుద్ధంలో భాజపా అనూహ్యంగా ప్రవేశించి రాజకీయాలను మరింత ఉత్కంఠగా మార్చింది. ప్రముఖ నటుడు సురేశ్ గోపీని రంగంలోకి దింపి బలమైన వ్యూహాన్ని రచించింది. మరి ఈ 'త్రిముఖ పోరు'లో విజయం ఎవరిని వరిస్తుంది? భాజపా ఆశించినట్టు సురేశ్ గోపీ చక్రం తిప్పుతారా?
యూడీఎఫ్ హవా...
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి త్రిస్సూర్.. ఎక్కువ కాలం యూడీఎఫ్ చేతిలోనే ఉంది.

2016లో 6,987 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సునీల్.. అనంతరం రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చూడండి:- కేరళలో బరిలోకి 'స్టార్ కిడ్స్'- వారసత్వం నిలిచేనా?
త్రిముఖ పోరు...
రెండు దశాబ్దాల తర్వాత గెలిచిన సీటును ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఎల్డీఎఫ్ దృఢ సంకల్పంతో ఉంది. రెండోసారి అధికారం చేపట్టాలనుకుంటున్న ఆ కూటమికి.. గతంలో గెలిచిన సీట్లను నిలబెట్టుకోవడం ఎంతో అవసరం కూడా. అందుకే సీపీఐ త్రిస్సూర్ జిల్లా కమిటీ సభ్యుడు బాలచంద్రన్‌ను బరిలోకి దింపింది.
కంచుకోటగా ఉన్న త్రిస్సూర్‌ను మళ్లీ సొంతం చేసుకునేందుకు యూడీఎఫ్ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. కూటమిలో లోపాల వల్ల 2016 ఎన్నికల్లో ఓడిన యూడీఎఫ్.. అలా మళ్లీ జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పుడూ కూటమిలో సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఏర్పడిన చీలికలు, స్వతంత్రుల తిరుగుబాటుతో యూడీఎఫ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా కూటమిపై ఒత్తిడి పెంచుతోంది. త్రిస్సూర్ అభ్యర్థి పద్మజా వేణుగోపాల్‌పైనే యూడీఎఫ్ అన్ని ఆశలు పెట్టుకుంది.
ఇన్నేళ్లూ పోటీలోనే భాజపా ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుని అందరికీ షాక్ ఇస్తోంది. ఎన్డీఏ 10ఏళ్లుగా క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. 2011 ఎన్నికల్లో త్రిస్సూర్‌లో కూటమికి కేవలం 6,6697 ఓట్లే వచ్చాయి. కానీ 2016లో ఆ సంఖ్య 24,748కు పెరిగింది. అంటే ఐదేళ్లలో నాలుగు రెట్లు వృద్ధి!
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన పురోగతి కూడా ఓ సానుకూల అంశం. ఫలితంగా.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. త్రిస్సూర్పై పట్టు సాధించాలని భావిస్తోంది కమలదళం. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు, రాజకీయ నేత సురేశ్ గోపీని రంగంలోకి దింపింది. ఆయన కూడా మిగిలిన అభ్యర్థులకు గట్టిపోటీనిస్తున్నారు. తీరికలేని ప్రచారాలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. సురేశ్‌కు ఉన్న ఆదరణను ఓట్లుగా మలుచుకోవచ్చని ఎన్డీఏ ధీమాగా ఉంది.


2021 ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. త్రిస్సూర్ నియోజకవర్గంలో మొత్తం 1,75,326 ఓట్లు ఉన్నాయి. ఇందులో 83,455 మంది పురుషులు కాగా.. 91,878మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరి వీరు ఎవరికి ఓట్లు వేస్తారు? త్రిస్సూర్ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది మే 2నే తేలుతుంది.

ఇదీ చూడండి:- 'కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ సంప్రదాయానికి బ్రేక్'