TSPSC paper lekage case : టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాల కేసులో నిందితులను అరెస్ట్ చేస్తున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే 36 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. తాజాగా మరో ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. రవి కిశోర్, విక్రమ్, దివ్యలను అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఇందులో విక్రమ్, దివ్య అన్నాచెల్లెలు. వీరు నల్గొండ జిల్లాకు చెందిన వీరు.. డీఏవో ప్రశ్నపత్రం కొన్నట్టుగా అధికారులు గుర్తించారు. మరో నిందితుడు రవి కిశోర్ ఏఈ ప్రశ్న పత్రం అమ్మినట్టుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులు సంఖ్య 39కి చేరుకుంది. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉందని.. నిందితుల సంఖ్య పెరిగే వీలు ఉందని అధికారులు వెల్లడించారు.
అరెస్టుల సంఖ్య 50కి చేరవచ్చు : కమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రోజుల తరబడి ప్రశ్నించి సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కష్టసాధ్యమైన పనికి సిద్ధమయ్యారు. గ్రూప్1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షలు రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఆధారంగా లిస్ట్‌ను తయారు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మార్కులు తెచ్చుకొన్న అభ్యర్థులను వేరు చేశారు. వారి ఫోన్ నంబర్లను గుర్తించి.. విచారించే పనిలో పడ్డారు. వారి బ్యాంకు ఖాతాలను సైతం పరిశీలించారు.
39కి చేరుకున్న నిందితుల అరెస్టుల సంఖ్య : ఆ అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు సిట్ అధికారులు కొన్ని ప్రశ్నావళిని రూపొందించి సమాధానాలు రాబట్టారు. వాటిని అంచనా వేసి అసలు నిందితులను గుర్తించారు. 20 మంది నిందితులు ఉండొచ్చని మొదట భావించారు. జవాబు పత్రాల పరిశీలనతో 39 మంది నిందితులుగా గుర్తించారు. ఈ సంఖ్య 50కు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సుమారు రూ.50లక్షల సొమ్ము చేతులు మారి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో 7,8 తేెదీల్లో టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీకైనట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి :