బిహార్‌లోని గయా జిల్లాలో ఫిరంగి గుండు ఇంట్లోకి దూసుకొచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సైనిక విన్యాసాల రిహార్సల్స్‌లో భాగంగా ఈ ఫిరంగి గుండును ప్రయోగించారు. బరాచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గులార్ బెడ్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగిందీ దుర్ఘటన.
హోలీ ఆడుతుండగా..
బుధవారం ఉదయం సైనికుల విన్యాసాల్లో భాగంగా ఉపయోగించే ఫిరంగిలో నుంచి ఓ గుండు ప్రమాదవశాత్తు గ్రామంలోని గోవింద్ మాంఝీ అనే వ్యక్తి నివాసంపై పడింది. అదే సమయంలో హోలీ వేడుకలు జరుపుకుంటున్న గోవింద్ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మిగతా ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
మృతుల్లో గోవింద్ అతడి కుమార్తె కంచన్‌తో పాటు అల్లుడు సూరజ్ కుమార్ ఉన్నట్లు సమాచారం. గీతా కుమారి, పింటు మాంఝీ, రసో దేవితో పాటు మరో ముగ్గురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, బుధవారం ఉదయం కుటుంబ సభ్యులంతా కలిసి హోలీ పండుగ జరుపుకొంటున్న సమయంలో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.
"మాకు సమాచారం అందిన వెంటనే ఘటన జరిగిన గులార్ బెడ్ గ్రామానికి వెళ్లాము. ఈ సంఘటనకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు జరిపిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తాము. దర్యాప్తు అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాము."
-గయా ఎస్ఎస్పీ ఆశిష్ భారతి
గయా జిల్లాలోని త్రిలోక్పుర్లో తరచూ సైనిక విన్యాసాలకు సంబంధించి ప్రాక్టీస్ జరుగుతుంది. ఈ రిహార్సల్స్‌లో భాగంగా ఫైరింగ్ కూడా చేస్తారు జవాన్లు. ఫైరింగ్ జరిగే ప్రాంతం పక్కనే ఉన్న కొన్ని గ్రామాల్లో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఒక్కోసారి దురదృష్టవశాత్తు ఫిరంగి గుండ్లు నిర్ణీత బోర్డర్ దాటి ప్రజల నివాసాలపై పడతాయి.
ప్రాక్టీస్ చేస్తుండగా తలలోకి బుల్లెట్..
సరిగ్గా కొన్ని నెలల క్రితం ఈ తరహా ఘటనే తమిళనాడులోని పుదుకొట్టయి జిల్లాలో వెలుగు చూసింది. శిక్షణలో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఓ 11 ఏళ్ల బాలుడి తలలోకి గన్‌లోని తూటా దూసుకెళ్లింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు పుఘళెందిని పుదుకొట్టయిలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తంజావూర్ వైద్య కళాశాలలో చేర్పించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.