Borewell baby dies : గుజరాత్లో శనివారం ఉదయం బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాపను కాపాడేందుకు 19 గంటల పాటు.. తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఘటనపై సమాచారం అందుకుని, వెంటనే రెస్కూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. ఆదివారం తెల్లవారుజామున పాపను బయటకు తీశారు. అయితే.. చిన్నారి చనిపోయిందని నిర్ధరించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లో జిల్లాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో పడింది. 200 అడుగుల లోతున్న బోరుబావిలో చిన్నారి పడిపోయినట్లు సమాచారం. 40 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకుందని అధికారులు తెలిపారు. తమచన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు ఓ గిరిజన తెగకు చెందిన వారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్నారు. అదే సమయంలో ఆ చుట్టుపక్కల ఆడుకుంటున్న చిన్నారి.. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. ఇది గమనించిన చిన్నారి కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
borewell baby rescue operation : సమాచారం అందుకున్న అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. శనివారం ఉదయం 11 గంటలకు సహాయక చర్యలు ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా 10 అడుగులు లోతులో గొయ్యి తవ్వి.. పాపను తీసేందుకు ప్రయత్నించారు. సైన్యం కూడా ఈ ఆపరేషన్‌కు సాయం అందించింది. చిన్నారికి ఆక్సిజన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కెమెరా సాయంతో చిన్నారిని ఉన్న స్థితిని తెలుసుకున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఈ ఉదయం 5.45కు పాపను బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచిందని నిర్ధరించారు.
మధ్యప్రదేశ్ నుంచి బాధిత కుటుంబం వలస..
చిన్నారి తండ్రి లాలుబాయ్. తల్లి రాంబాయ్. వీరంతా మధ్యప్రదేశ్‌లోని దేవ్పుర్ గ్రామానికి చెందిన వారు. ఉపాధి కోసం గుజరాత్‌కు వలస వచ్చారు. చిన్నారి పేరు రోషిని అని తెలిసింది.
బోరు బావిలో పడి బాలుడు మృతి.. కోతులకు భయపడి పరుగెడుతూ..
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. బోరు బావిలో పడి ఓ ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ప్రమాదవశాత్తు 60 అడుగుల బావిలో పడిన బాలుడిని.. అనేక గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు అధికారులు. అనంతరం పిల్లాడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి కుటుంబసభ్యులకు రూ.4లక్షల పరిహారం అందజేశారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
అంతకు ముందు ఇదే మధ్యప్రదేశ్‌లో బేతుల్ జిల్లాలో బోరు బావిలో పడ్డ ఓ చిన్నారి.. దాదాపు ఐదు రోజులు మృత్యువుతో పోరాడి మృతిచెందాడు. గత ఐదు రోజులుగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ బాలుడి ప్రాణాలను రక్షించలేకపోయింది. చిన్నారి తన్మయ్ మృతికి సంతాపం తెలిపిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అతడి కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.