ఝార్ఖండ్‌లోని రాంచీలో దారుణం జరిగింది. వాహనం దొంగలించాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిపై కొందరు మూకదాడికి పాల్పడ్డారు. బాధితుణ్ని చితకబాది, అతడి మృతికి కారకులయ్యారు.
ఈ ఘటనలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనందుకు కొత్వాలి ఠాణాలో ముగ్గురు పోలీసులను(వైభవ్ సింగ్, విజయ్ శంకర్ సింగ్, విశ్రమ్ తిగ్గా) సస్పెండ్ చేశారు స్థానిక ఎస్ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా.
ఇదీ చదవండి: ఉపాధి పేరుతో తీసుకెళ్లి యువతిపై 11మంది అత్యాచారం
ఏం జరిగిందంటే.?
అప్పర్ బజార్ ప్రాంతంలో టాటా-407 వాహనం చోరీకి గురైంది. అయితే.. నవటోలి గ్రామానికి చెందిన సచిన్ కుమార్ వర్మ(22) ఈ దొంగతనం చేశాడని స్థానికుల్లో కొందరు ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఈ నెల 7న(ఆదివారం) రాత్రి.. అతడిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అతి దారుణంగా కొట్టి, ఆ తర్వాత బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుణ్ని విడిపించారు. తీవ్రగాయాలపాలైన వర్మను ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం అతడు మృతిచెందాడు.
ఈ విషయమై మృతుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్మ నిర్దోషి అని, చోరీ జరిగిన రోజు అతడు తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి బయటకు వెళ్లినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 40 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:బాలికపై అత్యాచార కేసులో దోషికి మరణశిక్ష