ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌లో పూజలు నిర్వహించారనే ఆరోపణలతో ముగ్గురు హిందూ మహాసభ కార్యకర్తలను గురువారం అరెస్టు చేసింది.. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్). తొలుత 8 మందిని అదుపులోకి తీసుకోగా అనంతరం ఐదుగురిని విడిచిపెట్టారు. 'మహా శివరాత్రి' పర్వదినం సందర్భంగా తాజ్మహల్లోని డయానా బెంచ్ వద్ద హిందూ మహాసభ అధ్యక్షురాలు మీనా దివాకర్, ఆమె మద్దతుదారులు పూజలు చేశారని సమాచారం.
ఈ అరెస్టులను నిరసిస్తూ హిందూ మహాసభ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. వారిని వెంటనే విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
"తాజ్‌మహల్‌ను మేము ఎప్పటినుంచో శివ మందిరంగా భావిస్తున్నాం. మహా శివరాత్రి సందర్భంగా హారతినిచ్చిన మీనా దివాకర్‌ను సీఐఎస్ఎఫ్ అరెస్టు చేసింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తేజో మహల్ (తాజ్ మహల్) మా జన్మహక్కు. ఈ కట్టడంలో నమాజ్ చేయడం ద్వారా మైనారిటీలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారు."
-సంజయ్ జాట్, హిందూ మహాసభ అధికార ప్రతినిధి
తాజ్‌మహల్‌లో శివాలయం..
"తాజ్‌మహల్‌ను తవ్విచూస్తే మహాశివుని విగ్రహం బయటపడుతుంది. ఒకవేళ అలా జరగకపోతే ప్రాణ బలిదానానికి సిద్ధంగా ఉన్నా. అయోధ్యలో రామ మందిర అవశేషాలు లభించినట్లే తాజ్‌మహల్‌లో శివాలయం బయటపడుతుంది." అని సంజయ్ అన్నారు.
ఇదీ చూడండి: బాలికతో మత మార్పిడి- యువకుడి అరెస్ట్