దేశంలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తుంటే.. పలు చోట్ల ప్రజలు మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయు జిల్లాలో ఆదివారం ఇటువంటి ఘటనే జరిగింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ.. వేల సంఖ్యలో ప్రజలు ఓ మత గురువు అంతిమ యాత్రకు హాజరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం..
మత గురువైన హజరత్ మహమ్మద్ సలీముల్ కాదరీ ఆదివారం మృతి చెందారు. కాదరీ మరణ వార్త తెలిసి స్థానిక ప్రజలతో పాటు సమీప గ్రామాల్లోని వారు కూడా తరలివచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కాదరీ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఇదీ చదవండి : రైల్వే, కేంద్ర బలగాలపై కరోనా పంజా!