అది ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని బారా గ్రామం. ఆ ఊర్లో 80శాతం మంది జనవరి ఒకటో తారీఖున పుట్టారు. ఒక ఇంట్లో ఉండే నాన్న, అమ్మ, కొడుకు, కూతురు, కొడుకు, కోడలు, వారి పిల్లలు ఇలా అందరి పుట్టిన రోజులు కొత్త సంవత్సరం ఆరంభం రోజునే ఉంటాయి. కేవలం పుట్టిన ఏడాదిలో మాత్రమే మార్పు ఉంటుంది. నిజమేనా అని గ్రామస్థులను అడిగితే సమాధానంగా వారు ఆధార్ కార్డు చూపిస్తారు.
అసలు కథేంటి?
అయితే ఈ పుట్టిన రోజులు వెనుక ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఆధార్ కార్డును 2010 నుంచి ప్రతి భారతీయుని వ్యక్తిగత గుర్తింపుగా తీసుకొచ్చింది. 2012లో ప్రయాగ్‌రాజ్‌లోని 'బారా' గ్రామానికి ఆధార్‌కార్డు వివరాలు నమోదు చేసే ప్రతినిధి వచ్చారు. అప్పుడు ఊరిలో ఉన్న 90శాతం మందికి వారి పుట్టిన రోజులపై అవగాహన లేదు. వారికి తెలిసిందల్లా సంవత్సరం ఒక్కటే. ఈ క్రమంలో వారందరికీ జనవరి ఒకటో తారీఖును జన్మదినంగా నిర్ధరించారు ఆ ఆధార్ ప్రతినిధి. దీంతో ఊర్లో 80శాతం మంది ఒకే రోజున పుట్టినట్లు అయ్యింది.
అయితే వీటిని సరిదిద్దడానికి ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు అని అంటున్నారు గ్రామస్థులు. ప్రభుత్వానికి సంబంధించిన 70శాతం పథకాలు ఆధార్‌తో ముడిపడి ఉండగా.. భవిష్యత్తులో వారికి లభించే ప్రయోజనాలను కోల్పోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.