జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్‌కు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్రీడల పట్ల దేశ యువత చూపించే ప్రేమే ఆయనకు ఇచ్చే గొప్ప నివాళిగా పేర్కొన్నారు.
80వ మన్ కీ బాత్(మనసులో మాట) కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు ప్రధాని మోదీ.
"హాకీలో 40 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఒలింపిక్స్ పతకం సాధించాం. ఈ రోజు మేజర్ ధ్యాన్‌చంద్ ఎంత సంతోషించేవారో ఓసారి ఊహించండి. ఆటల పట్ల దేశ యువత కనబరుస్తున్న ఆసక్తి, ప్రేమను మనం చూస్తున్నాం. క్రీడల పట్ల ఉన్న ఈ అభిరుచే మేజర్ ధ్యాన్ చంద్‌కు ఇచ్చే గొప్ప నివాళి. ఈ వేగాన్ని మనం ఆపకూడదు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఉన్న క్రీడామైదానాలు నిండిపోవాలి. అందరి భాగస్వామ్యంతోనే భారత్ క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుతుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇందోర్పై ప్రశంసలు..
మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ స్వచ్ఛతలో చాలా ఏళ్లుగా తొలిస్థానంలో కొనసాగుతోందని కొనియాడారు మోదీ. తమ నగరాన్ని వాటర్ ప్లస్ సిటీగా మార్చుకున్నారని పేర్కొన్నారు. మన దేశంలో స్వచ్ఛతతో చాలా నగరాలు 'వాటర్ ప్లస్'గా మారతాయని సూచించారు.