కొడచ్చేరి మెడక్కరా బాలన్ నాయర్ అలియాస్ ధన్యా బాలన్ నాయర్.. జీవనోపాధి కోసం తొలుత ధన్యా పేరుతో ఓ హోటల్ నడిపేవారు. ఆ పేరునే ఆయన పేరుకు జోడించి.. ధన్యా బాలన్ నాయర్ అని స్థానికులు పిలుస్తారు. ఆ హోటల్ సరిగా నడవక.. నష్టాల్లో కూరుకుపోయారు బాలన్. అయితే అక్కడే ఆగిపోలేదు. అ తర్వాత ఎరువుల వ్యాపారం ప్రారంభించారు. కరోనా లాక్‌డౌన్‌తో ఎరువుల అమ్మకాలు సరిగా సాగలేదు. ఫలితంగా ఈ వ్యాపారం కూడా బాలన్‌కు దుఃఖాన్నే మిగిల్చింది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా.. కొత్తమార్గాల అన్వేషణ ఆపలేదు. నిరాశ చెందలేదు.
లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బంది పడిన బాలన్.. చేపల పెంపకంపై దృష్టిని మళ్లించారు. తన ఇంటి వద్దనే ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. సెంటున్నర స్థలంలో రూ.1.5 లక్షలు ఖర్చు చేసి చిన్న చేపల కుండీని నిర్మించి.. అందుకు కావాల్సిన నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అందులో తిలపియ జీన్స్‌కు చెందిన చిత్రలాదం చేపలను పెంచాలని నిర్ణయించారు. వాటికి పాషన్ ఫ్రూట్ చెట్ల ఆకులను ఆహారంగా వేస్తున్నారు. వీటిని కొనుగోలు చేయకుండా చేపల నీటి ట్యాంక్‌పైనే పందిరి వేసి.. పెంచుతున్నారు.
మొదటి రెండు వ్యాపారాలతో నష్టాలను చవిచూసిన బాలన్.. గడిచిన ఐదునెలలుగా చేపల వ్యాపారంలో దూసుకుపోతున్నారు. దీంతో అథోళి వ్యవసాయ అధికారి సువర్ణ శ్యామ్.. బాలన్‌ను అభినందించారు. జీవితంపై ఎప్పుడూ ఆశలు వదులుకోవద్దన్నారు బాలన్.
ఇదీ చూడండి: Live Video: వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కార్లు