జమ్ముకశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఎన్నో ఎళ్లుగా ప్రభుత్వాలు పరితపిస్తున్నాయి. కానీ దీన్ని సాధించడం అత్యంత క్లిష్టం. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న బయటి శక్తుల జోక్యం, వేర్పాటువాదం, లోతుగా పాతుకుపోయిన మత విభజన వంటి క్లిష్ట సమస్యలు కశ్మీర్ ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్నాయి. ఇక 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. ఇది కశ్మీర్ ప్రజలకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా సర్కార్ చేసిన నమ్మక ద్రోహమని ఆ ప్రాంత రాజకీయ నేతలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాటకీయ పరిణామాలు..
కశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయిన అనంతరం గత రెండేళ్లలో రాజకీయపరంగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన కశ్మీర్ నేతలను ప్రభుత్వం నిర్బంధించింది. శాంతిపునరుద్ధరణకే ఇలా చేసినట్లు తమ చర్యను కేంద్రం సమర్థించుకుంది. ఈ వాదనను తోసిపుచ్చిన కశ్మీర్ నేతలు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల నేఫథ్యంలో ఎవరూ ఊహించని విధంగా కశ్మీర్‌లోని అన్ని పార్టీల నేతలను జూన్ 24న సమావేశానికి ఆహ్వానించి ఆశ్చర్యపరిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన విషయాన్నే.. మోదీతో భేటీలో కశ్మీర్ నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.
దాడి రూపంలో సవాల్..
కశ్మీర్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జూన్ 27 జమ్ములోని వాయుసేన ఎయిర్‌పోర్టులో జరిగిన డ్రోన్ల దాడి మరో సవాల్ విసిరింది. భారత్‌లో ఈ తరహా దాడులు జరగడం ఇదే తొలిసారి కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఉగ్రవాదుల చర్యే అని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. కశ్మీర్ నేతలతో కేంద్రం చర్చలు జరుపుతున్న సమయంలో ఈ దాడి జరగడం చూస్తే ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడం ఎంత క్లిష్టమో అర్థమవుతోంది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద సంబంధ ఘటనలను నిలువరించేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు చెప్పి కేంద్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేయడం వల్ల హింస మరింత పెరుగుతుందని, ఉగ్రవాద ఘటనలు ఇంకా ఎక్కువ అవుతాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు భిన్నంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఉగ్రవాద, హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేంద్రం చేసిన నిరంతర ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైంది. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అనేక మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరికొంత మంది ముష్కరులు లొంగిపోయారు.
క్లిష్ట సమస్యలు
హింస, ఉగ్రవాదం తగ్గితే శాంతి నెలకొల్పామని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటాయి. అంతమాత్రాన జమ్ముకశ్మీర్లో నిజంగా శాంతిభద్రతలు పునరుద్ధరించినట్లు కాదు. అత్యంత సంక్లిష్ట సమస్యలు పరిష్కారం కానంతవరకు కశ్మీర్లో లోయలో శాంతి నెలకొల్పడం కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా పెద్ద సవాలే. వాటిలో పాకిస్థాన్ సమస్య ఒకటి కాగా.. మరో ప్రధాన సమస్య వేర్పాటువాదం. ఈ సంక్లిష్టతలు జాతీయవాదం, సార్వభౌమాధికారంతో ముడిపడి ఉన్నాయి. వాటిని పరిష్కరించకపోతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే బయటి శక్తుల నుంచి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మోదీతో కశ్మీర్ నేతల భేటీ తర్వాత మూడు రోజులకే జమ్ములోని వాయుసేన స్థావరంలో పేలుళ్ల ఘటనే ఇందుకు ఉదాహరణ. ఇది పాకిస్థాన్ పనే అని మీడియాలో వార్తలొచ్చాయి.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మోహబూబా ముఫ్తీ కూడా కశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారనికి పాకిస్థాన్, వేర్పాటువాదులతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ఈ వ్యాఖ్యలను ఎవరూ స్వాగతించలేదు. ఇది జమ్ముకశ్మీర్లో శాంతిభద్రతల పునరుద్ధరణకు ఉన్న ఇబ్బందులను పునరుద్ఘాటించింది.
పొరుగు దేశాలతో ముప్పు..
భారత్ పొరుగు దేశాల్లో భౌగోళిక, రాజకీయ మార్పులు కూడా ఈ అంశంలో కీలకం. అఫ్గానిస్థాన్‌లోని తమ బలగాలను అమెరికా ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్లు బలపడుతున్నారు. ఈ పరిణామాలు వేర్పాటువాదులు, ఉగ్రవాదులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దిన్ వంటి ఉగ్రసంస్థతో తాలిబన్లకు ఉన్న సంబధాలు కశ్మీర్ లోయలో ఉగ్రకార్యకలాపాలను ప్రభావితం చేసే అవకాశముంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆధిపత్యం, ఉగ్రవాదులకు పాక్ సహకారం, ఆర్టికల్ 370 రద్దుపై వ్యతిరేకత వంటి అంశాలు కశ్మీర్లో శాంతి పునరుద్ధరణకు ప్రధాన అవరోధాలు.
కశ్మీర్లో శాంతి సాధన ఏ ప్రభుత్వానికైనా అంత సులభం కాదు. దశాబ్దాలుగా అక్కడి బహుళ సమస్యలు కొత్త రూపు సంతరించుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్ నేతలతో చర్చలను ప్రధాని మోదీ ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలి. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తే అక్కడి ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా, చర్చల ద్వారా ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.
- డా.అన్షుమన్ బెహెరా, బెంగళూర్ ఎన్ఐఏఎస్ అసోసియేట్ ప్రొఫెసర్
ఇవీ చూడండి: